గణేశ్ ఉత్సవాలపై సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు.. నెల రోజుల పాటు విజిబుల్ పోలీసింగ్
ABN , Publish Date - Sep 05 , 2026 | 07:25 PM
రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను భాగ్యనగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): రాబోయే వినాయక చవితి ఉత్సవాలు (Ganesh Celebrations), నిమజ్జన వేడుకలను భాగ్యనగరంలో అత్యంత శాంతియుత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) ఆదేశించారు. గణేశ్ ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లపై ఈరోజు (శనివారం) బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ఎస్ఐ, ఆపై స్థాయి పోలీస్ అధికారులతో సజ్జనార్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మొదటగా లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ డీసీపీలు తమ పరిధిలో చేపడుతున్న భద్రతా చర్యలు, ఇతర శాఖలతో సమన్వయం, బందోబస్తు ప్రణాళికలను వివరించారు.
గణేశ్ ఉత్సవాలను సమష్టి కృషితో ప్రశాంతంగా పూర్తి చేయాలి
అనంతరం హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాట్లాడారు. ఇటీవల ముగిసిన బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన తరహాలోనే, వినాయక చవితి ఉత్సవాలను కూడా సమష్టి కృషితో ప్రశాంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. పదకొండు రోజుల పాటు జరిగే గణేశ్ ఉత్సవాలను అత్యంత సీరియస్‌గా తీసుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. భాగ్యనగరంలో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు క్షేత్రస్థాయిలో ఎస్‌హెచ్‌వోలు, శాంతి కమిటీలు, మండపాల నిర్వాహకులు, వివిధ శాఖల ప్రతినిధులతో నిరంతరం సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో కొనసాగే సాధారణ కార్యక్రమాలు, రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలి...
ఏమాత్రం అలసత్వానికి తావులేకుండా పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని గణేశ్ మండపాల నిర్వాహకులు హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన యాప్‌లో విధిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ వివరాలను నిర్దేశిత యాప్‌లో తప్పనిసరిగా జియో-ట్యాగింగ్ చేయాలని నిర్దేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు, క్యూలైన్లు, భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాల ఏర్పాటును నిర్వాహకులు చేపట్టేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా సెక్టార్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్‌లను హైదరాబాద్ సిటీలో కలపడంతో బాలాపూర్ నుంచి ఖైరతాబాద్ వరకు ఉత్సవాలు నగర పోలీస్ పరిధిలోకి వచ్చాయని తెలిపారు. బాలాపూర్ నుంచి ప్రారంభమై ప్రధాన నిమజ్జన మార్గాల వెంట ట్యాంక్‌బండ్, ఇతర జలాశయాల వరకు వెళ్లే మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఆయా కమిషనరేట్లతో సమన్వయం చేసుకోవాలి..
భారీ విగ్రహాల తరలింపులో ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు రాకుండా, ఎత్తు ఎక్కువగా ఉన్న విగ్రహాలతో విద్యుత్ తీగలు తగలకుండా ముందస్తుగానే రూట్ క్లియరెన్స్ పూర్తి చేసుకోవాలని సీపీ సజ్జనార్ నిర్దేశించారు. సైబరాబాద్, రాచకొండ సరిహద్దుల నుంచి వచ్చే విగ్రహాల రాకపోకలపై ఆయా కమిషనరేట్లతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఖైరతాబాద్ బడా గణేశ్ వంటి భారీ రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. లంబోదరుడి పండుగ వేళ సమాజంలో విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులు, వదంతులపై ఐటీ సెల్, స్థానిక పోలీసులు 24 గంటల పాటు పర్యవేక్షిస్తాయని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాబోయే నెల రోజులు ఎంతో కీలకం..
రాబోయే నెల రోజులు ఎంతో కీలకమని అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. విధుల్లో ఉండే సిబ్బంది ప్రజలు, భక్తులతో ఎంతో సంయమనం, ఓర్పుతో వ్యవహరించాలని సీపీ సజ్జనార్ సూచించారు. ఈ సమావేశంలో ఎం. శ్రీనివాస్, ఐపీఎస్ (అడిషనల్ సీపీ, క్రైమ్స్ & సిట్), తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్ (అడిషనల్ సీపీ, లా & ఆర్డర్), S.M. విజయ్ కుమార్, ఐపీఎస్ (జాయింట్ సీపీ, స్పెషల్ బ్రాంచ్), వివిధ జోన్ల డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News