Share News

తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదు.. కేటీఆర్ ఘాటు విమర్శలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 09:42 AM

కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర ప్రజలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు.

 తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదు.. కేటీఆర్ ఘాటు విమర్శలు
KTR

హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర ప్రజలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టారు.రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు అబద్ధాలు, పచ్చి అబద్ధాలని విమర్శించారు. వీటన్నింటికీ మించి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ‘అభయ హస్తం’, 420హామీలు, 13 డిక్లరేషన్లు, 6గ్యారెంటీలపై రాహుల్ గాంధీ వెంటనే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.


బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఏమైంది..?

బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి.. మూడేళ్లలో అమలు చేసింది రూ.5 వేల కోట్లలోపేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42 శాతం వాటా హామీ ఇచ్చారని.. అమలు చేసింది మాత్రం జీరోనే అని విమర్శించారు. పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల అంబేడ్కర్ అభయ హస్తం పథకం హామీ ఇచ్చారని.. అమలు చేసింది మాత్రం జీరోనే అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు 31 శాతం వాటా హామీ ఇచ్చి.. అమలు చేసింది జీరోనే అని ఆక్షేపించారు.


రాజీవ్ యువ వికాసం పథకం అమలేది..?

365 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారని.. రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించారని .. ఈ హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 10 వేలు మాత్రమేనని.. రాజీవ్ యువ వికాసం ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు హామీ ఏమైందని ప్రశ్నించారు. మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పారని.. కేటాయించింది మాత్రం రూ.వెయ్యి కోట్లలోపేనని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి అంతులేదని కేటీఆర్ ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి

అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా

ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 14 , 2026 | 09:59 AM