Share News

ఉప్పల్‌లో బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ప్రత్యేక నిఘా

ABN , Publish Date - May 21 , 2026 | 05:22 PM

ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉప్పల్‌లో బెంగళూరు-హైదరాబాద్ మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా.. పోలీసుల ప్రత్యేక నిఘా
IPL Black Ticket Racket

హైదరాబాద్, మే21 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్ స్టేడియం వేదికగా రేపు(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన వెంటనే ‘సోల్డ్ అవుట్’ కావడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ముఠాలు ముందుగానే భారీ సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసి, వాటిని బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నిజమైన క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరకకుండా పోతున్నాయని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.


జొమాటో, డిస్ట్రిక్ యాప్స్‌ బుకింగ్‌లపై అనుమానాలు..

ప్రత్యేకంగా జొమాటో(Zomato) డిస్ట్రిక్ యాప్స్‌( District App) ద్వారా జరిగిన బుకింగ్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. సాధారణ ధరలకు లభించాల్సిన టికెట్లు పలుమార్లు ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని, దీంతో నిజమైన అభిమానులు మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని కోల్పోతున్నారని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై మల్కాజ్‌గిరి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.


10 కేసులు నమోదు..

బ్లాక్ టికెట్ల విక్రయాలపై ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు స్టేడియం పరిసర ప్రాంతాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లు, సోషల్ మీడియాపై నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. టికెట్లను అక్రమంగా అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభిమానులు కూడా అధికారిక ప్లాట్‌ఫాంల ద్వారానే టికెట్లు కొనుగోలు చేయాలని, బ్లాక్ మార్కెట్‌కు ప్రోత్సాహం ఇవ్వొద్దని సూచించారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఉండటంతో ప్రతి సీజన్‌లో బ్లాక్ టికెట్ల సమస్య తలెత్తుతోంది. ఉప్పల్‌లో రేపు జరిగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మ్యాచ్‌కు భారీ క్రేజ్ ఉండటంతో బ్లాక్ టికెట్ల దందా మరింత పెరిగిందని అభిమానులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సరస్వతీ అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు.. భక్తులకు సీఎం శుభాకాంక్షలు

కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేశాం: బండి సంజయ్‌

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 05:34 PM