Share News

బియ్యం ఎగుమతులపై పోరు: అసెంబ్లీలో హరీశ్‌రావు, ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:15 AM

తెలంగాణ అసెంబ్లీలో బియ్యం ఎగుమతులపై సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

బియ్యం ఎగుమతులపై పోరు: అసెంబ్లీలో హరీశ్‌రావు, ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం
Telangana Assembly

హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీలో బియ్యం ఎగుమతులపై ఈరోజు(సోమవారం) చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఫిలిప్పీన్స్‌కు బియ్యం పంపడంలో కుంభకోణం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. భారీ కుంభకోణం జరిగిందని అవన్నీ నిరాధారమైన వ్యాఖ్యలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టిపారేశారు.


హరీశ్‌రావు ఆరోపణలు..

బియ్యం ఎగుమతుల్లో పెద్ద స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. బియ్యం ఎగుమతిని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇవ్వకుండా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెట్టారు? దీనికి టెండర్లు పిలిచారా? లేదా నామినేషన్ పద్ధతిలో ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఏడాది కాలంగా కాకినాడ పోర్టులో బియ్యం నిల్వ ఉంచితే అవి పాడైపోవా? వాటి నాణ్యత ఏమైందని నిలదీశారు.


సలహాదారు ఎంపికపై ప్రశ్నలు..

ప్రేమ్‌చంద్ అనే వ్యక్తిని సలహాదారుగా నియమించడాన్నిహరీశ్‌రావు తప్పుబట్టారు. ఒక ‘ఘరానా మోసగాడిని’ సలహాదారుగా ఎలా పెట్టుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఈ మొత్తం వ్యవహారంపై హౌస్ కమిటీ వేసి విచారణ జరిపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్

హరీశ్‌రావు మాటలన్నీ అబద్ధాలేనని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీశ్‌రావు ఏదైనా రికమండేషన్ చేస్తే అధికారులు వినకపోతే, వెంటనే దానిని స్కామ్ అనడం ఆయనకు అలవాటని ఎద్దేవా చేశారు.


తొలిసారి ఎగుమతి..

తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి చేశామని, ఇందులో ఎలాంటి మధ్యవర్తులు లేరని మంత్రి స్పష్టం చేశారు. సివిల్ సప్లైస్ విభాగంలో ఎలాంటి స్కామ్ జరగలేదని, హరీశ్‌రావు కేవలం సభను పక్కదారి పట్టించడానికి సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన

బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 23 , 2026 | 11:31 AM