Share News

ఆ విమానాశ్రయాల ప‌నులు వేగ‌వంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:58 PM

కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఢిల్లీలోని పౌర విమాన‌యాన శాఖ కార్యాల‌యం రాజీవ్ గాంధీ భ‌వ‌న్‌లో బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఆ విమానాశ్రయాల ప‌నులు వేగ‌వంతం చేయండి: సీఎం రేవంత్‌రెడ్డి
Telangana CM Revanth Reddy

ఢిల్లీ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహ‌న్ నాయుడుతో.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ఢిల్లీలోని పౌర విమాన‌యాన శాఖ కార్యాల‌యం రాజీవ్ గాంధీ భ‌వ‌న్‌లో ఈరోజు (బుధవారం) సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణ‌లో ఆదిలాబాద్‌, మామూనురు (వ‌రంగ‌ల్‌) విమానాశ్రయాల ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని కోరారు. మామూనురు విమానాశ్రయానికి అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ‌ను పూర్తి చేసి ఇచ్చామ‌ని కేంద్రమంత్రికి.. సీఎం రేవంత్ తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయంలో కార్గో, ప్యాసింజ‌ర్ టెర్మిన‌ల్‌, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్‌, రిపేర్స్‌, ఓవ‌ర్‌హాలింగ్‌) వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని సీఎం విజ్ఞప్తి చేశారు.


ఆదిలాబాద్‌లో ర‌న్ వే ఫైన‌లైజ్‌కు సంబంధించి ర‌క్షణ, పౌర విమానయ‌న శాఖ‌ల సంయుక్త స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ టెండ‌ర్లను రెండు వారాల్లో పిలిచి డిసెంబ‌ర్ నాటికి ఖ‌రారు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహ‌న్ వెల్లడించారు. ఆ ప‌నుల‌కు అదే నెల‌లో శంకుస్థాప‌న చేస్తామ‌ని రామ్మోహ‌న్ తెలిపారు. తెలంగాణ‌లో ఛాప‌ర్ల ద్వారా హెలీ టూరిజం అభివృద్ధికి కృషి చేయాల‌ని కేంద్రమంత్రి రామ్మోహ‌న్‌కు.. సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.


హెలీ టూరిజంతో తెలంగాణ‌లో ప‌ర్యాట‌క రంగం మ‌రింత అభివృద్ధికి అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం తెలిపారు. హుస్సేన్ సాగ‌ర్‌లో సీ ప్లేన్ ల్యాండింగ్‌కు సంబంధించిన నివేదిక‌ను రెండు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అంద‌జేస్తామ‌ని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఈ స‌మావేశంలో ఎంపీలు సురేశ్ షెట్కార్‌, ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు (ప్రొటోకాల్‌) హ‌ర్కార వేణుగోపాల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి సంజ‌య్ జాజు, సీఎం సెక్రట‌రీ మాణిక్ రాజ్ తదిత‌రులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 05:21 PM