Share News

మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 23 , 2026 | 12:35 PM

తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు.

మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు?: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు. ఈరోజు(సోమవారం) శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నగరంలో ఉన్న పరిశ్రమలను సిటీ బయటకు తరలిస్తే.. ఆ భూములను మల్టీజోన్స్‌గా వినియోగించుకోవచ్చని వివరించారు. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టీ ఎందుకు సహకరించలేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకే మెట్రోను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రూ.15 వేల కోట్లతో మెట్రోను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఏ రాష్ట్రంలోనైనా ఎయిర్‌పోర్టులకు మెట్రో కనెక్టివిటీ ఉంటుందని.. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. జూన్‌, జులైలోపు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.


అసత్య ప్రచారాలు చేయొద్దు..

పంజాగుట్ట, హైటెక్‌‌సిటీ, జూబ్లీహిల్స్‌లో ఎలివేటెడ్‌ కారిడార్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రూ.24 వేల కోట్లతో 74 కిలోమీటర్ల మేరకు మెట్రోను విస్తరిస్తామని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా బేగంపేట ఎయిర్‌పోర్టు మధ్య నుంచి అండర్‌పాస్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సిగ్నల్స్‌ దగ్గర వాహనాలు ఆగకుండా వెళ్లాలనేదే తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలే కొన్ని ప్రమాదాలకు కారణమని అన్నారు. చిరు వ్యాపారులకు ఇబ్బంది ఉన్నా ఆక్రమణలు తొలగిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ మాదిరిగా కాలుష్య నగరం కాకూడదనే హిల్ట్ పాలసీ తీసుకువచ్చామని వివరించారు. ప్రతిపక్షాల నేతలు హిల్ట్‌పాలసీపై ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయొద్దని హితవు పలికారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించొద్దని కోరారు. నగరం నుంచి బయటకు వెళ్లేందుకే ఎలివేటెడ్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం..

మూసీ ప్రాజెక్టుతోపాటు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణం జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎలివేటెడ్‌ కారిడార్లకు ఎక్కువ భూమి కూడా అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో మాదిరిగా నచ్చితే నజరానా.. లేకపోతే జరిమానా విధించే విధానం ఉండదని చెప్పుకొచ్చారు. గుడ్‌ గవర్నెన్స్‌ కాదని.. మాది స్మార్ట్‌ గవర్నెన్స్‌ అని వ్యాఖ్యానించారు. అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని.. ప్రతిపక్షాలు, ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రతిపక్షాల నేతలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూడొద్దని.. ఏవైనా సూచనలు ఉంటే ఇవ్వండి.. స్వీకరిస్తామని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన అత్యంత అవసరమని తెలిపారు. మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలు కూడా తినే పరిస్థితి లేదని అన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను తమ ప్రభుత్వం తీసుకురాలేదని..కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన విధానాన్నే తాము కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. గుజరాత్‌లో సబర్మతి ప్రక్షాళనకు కాంగ్రెస్‌ సహకరించిందని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళనకు రాజకీయ రంగు ఎందుకు? అని ప్రశ్నించారు. ఎవరినీ నిరాశ్రయులను చేయం.. పునరావాసం కల్పిస్తామని భరోసా కల్పించారు. ప్రతిపక్షాల నేతలు అడ్డుకోవడం తప్పించి.. ఏ సలహా ఇచ్చినా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరికీ నష్టం కలిగించం.. బాధితులందరినీ ఆదుకుంటామని మాటిచ్చారు. మూసీ పరివాహకంలో ఉన్న అందరికీ మెరుగైన వసతులు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.


వర్షం పడిందంటే కదల్లేని పరిస్థితి..

హైదరాబాద్‌లో వర్షం పడిందంటే కదల్లేని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారులకు ఇబ్బందులు తప్పట్లేదని తెలిపారు. హైదరాబాద్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ఐదు మెట్రో నగరాలైన హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు అత్యంత కీలకమైనవని చెప్పుకొచ్చారు. పెట్టుబడులను నగరాల నిర్మాణం, నిర్వహణ నిర్దేశిస్తాయని అన్నారు. నగరాలపైనే రాష్ట్రాల ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో కాలుష్యం వల్లే స్కూల్స్‌, ఆఫీసులకు సెలవులు ఇస్తున్నారని ప్రస్తావించారు. ముంబైలో వర్షం పడిందంటే కదల్లేని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. చెన్నై, బెంగళూరులోనూ ట్రాఫిక్‌ కష్టాలు తప్పట్లేదని అన్నారు. మానవ తప్పిదాల వల్లే అనేక కష్టాలు వస్తున్నాయని ప్రస్తావించారు. హైదరాబాద్‌ అంటే లేక్స్‌ అండ్‌ రాక్స్‌ సిటీ అని చెప్పుకొచ్చారు. ఓల్డ్‌ సిటీగా పిలుస్తున్న ప్రాంతం ఒకప్పుడు ఒరిజినల్‌ సిటీ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

నేను ఇక కాంగ్రెస్‌లో ఉండలేను.. జీవన్‌రెడ్డి సంచలన ప్రకటన

బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 23 , 2026 | 12:53 PM