కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:37 AM
బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్‌లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్‌లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అని ప్రశ్నించారు. మంచి పాఠశాలలు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? అని నిలదీశారు.
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది?: బండి సంజయ్
ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కేసీఆర్ హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని ప్రశ్నల వర్షం కురిపించారు. సరిపడా ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదు? అని నిలదీశారు.యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు ఎందుకు పేరుకుపోయేలా చేశారు? అని అడిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని పేపర్ లీక్‌లు జరిగాయి? అని ప్రశ్నించారు.
మీ సొంత పిల్లలే ఇప్పుడు సమస్యలను ఎత్తిచూపుతున్నారు..
కాలేజీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సకాలంలో ఎందుకు చెల్లించలేకపోయారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాల్లో పాల్గొన్న యూనివర్సిటీ విద్యార్థులకు కనీస గౌరవం అయినా ఇచ్చారా?. బీఆర్‌ఎస్ పాలనకు ఇప్పుడు కేసీఆర్ కుటుంబం నుంచే రిపోర్ట్ కార్డు వస్తోంది. మొదట ఆయన మనవడు పాఠశాలలు బాగోలేవని చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన మనవరాలు కాలేజీలు కూడా బాగోలేవని చెబుతోంది. పదేళ్లు అధికారంలో ఉండి, మీరు పరిష్కరించలేకపోయిన సమస్యలను మీ సొంత పిల్లలే ఇప్పుడు ఎత్తిచూపుతున్నారు. మీ రాజకీయ ప్రత్యర్థుల పిల్లలు కాలేజీల్లో ఏం చేస్తున్నారో గమనించడం, మా ఫోన్లను ట్యాప్ చేయడంపై దృష్టి పెట్టడం బదులు, మీ సొంత పిల్లలు చెబుతున్న విషయాలను మీరు వినాల్సింది. ఇక మరో అద్భుతమైన మాట: భారత్ కంటే శ్రీలంక గొప్పదట!. లంకను చూసి భారత్ కంటే గొప్పదని చెప్పేది రావణాసురుడే. రామభక్తులు ఎప్పటికీ తమ మాతృభూమి గురించి ఇంత అవమానకరంగా మాట్లాడరు’ అని బండి సంజయ్ అన్నారు.
నాకు ఎల్లప్పుడూ నేషనే ఫస్ట్..
‘భారత్‌లో అధికారాన్ని కోరుకుంటారని, ఇక్కడి ప్రజాధనంపై నియంత్రణ కావాలని కోరుకుంటారు. కానీ దేశాన్ని ప్రశంసించే విషయానికి వచ్చేసరికి, ఇతర దేశాలన్నీ గొప్పగా కనిపిస్తాయి. ఒకవైపు కాంగ్రెస్ వందేమాతరం పాడటం ఆపాలని కోరుతోంది. మన ఇంజినీర్లను ‘క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్ భారత్‌లో మంచి కాలేజీలు లేవని, ఇతర దేశాలు భారత్ కంటే మెరుగ్గా ఉన్నాయని చెబుతోంది. అలాంటి వాళ్లు నేను నా చెమటను త్రివర్ణ కండువాతో తుడుచుకున్నానని నా దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు!. నా చివరి శ్వాస వరకు కాషాయ జెండాను, త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తాను. ఈ దేశం నా చెమటను చూసింది. భారత్‌కు ఎప్పుడైనా అవసరమైతే నా రక్తాన్ని కూడా ఇస్తాను. మీరు నన్ను వెయ్యిసార్లు ప్రశ్నించినా, ‘భారత్ మాతా కీ జై’ అంటా. మీరు ఎప్పటికీ నన్ను అర్థం చేసుకోలేరు. మీకు దేశభక్తి ఒక చర్చ కావచ్చు. నాకు మాత్రం అది జీవితాంతం నమ్మిన సిద్ధాంతం. నాకు ఎల్లప్పుడూ నేషనే ఫస్ట్’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్
నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News