జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు
ABN , Publish Date - Aug 14 , 2026 | 09:07 AM
అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) పేర్కొన్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకుండా అడ్డుకోలేరని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిను (Revanth Reddy) ఎక్స్ వేదికగా హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలు పండాయని ఈ ప్రభుత్వం ప్రచారం చేస్తోందని అన్నారు. మరి గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గట్టిగా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడం.. ఇవన్నీ రికార్డు స్థాయి పంట సాగుకు కారణాలు కావా? హరీశ్‌రావు అని నిలదీశారు. మసిపూసి మారేడు కాయ చేసినంత మాత్రాన వాస్తవాలు దాగుతాయా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎల్లంపల్లి - మిడ్‌మానేరు కాళేశ్వరం వ్యవస్థలో కీలక భాగాలు అనే వాస్తవాన్ని ఎంత దాచిపెట్టినా చరిత్రను మార్చలేరని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ద్వారా SRSP, నిజాంసాగర్ పూర్తి ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయనే వాస్తవాన్ని కూడా విస్మరించలేరని అన్నారు.
వ్యవసాయం, సాగునీటి రంగాలపై కాంగ్రెస్ సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం యావత్ తెలంగాణకు శాపంగా మారిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా జలాల కోసం మళ్లీ ఉద్యమాలు చేసే పరిస్థితిని కల్పిస్తున్నారని తెలిపారు. అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, రీట్వీట్లతో రైతులను మభ్యపెట్టడం ఆపాలని హితవు పలికారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ఏపీ ప్రతిపాదించిన తెలంగాణ వ్యతిరేక అంశాలను జీఆర్ఎంబీ(GRMB) అజెండా నుంచి తొలగించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
అజెండా అంశాలు తొలగించకుండా ఈనెల 18వ తేదీన జరిగే సమావేశానికి హాజరైతే తాము చూస్తూ ఊరుకోమని హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
వార్తలు కూడా చదవండి...
ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News