మహిళా రిజర్వేషన్లపై బీజేపీ ‘మాస్టర్ ప్లాన్’.. పార్లమెంటు బిల్లుకు ముందే దేశవ్యాప్త ప్రచారం!
ABN , Publish Date - Apr 10 , 2026 | 02:36 PM
ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది.
ఢిల్లీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు (Women Reservation Bill) పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ (BJP) భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. 2029 ఎన్నికల నుంచే చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా చట్టంలో అవసరమైన సవరణలు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధమైంది.
పలు రాష్ట్రాల అధ్యక్షులతో నితిన్ నబీన్ కీలక భేటీ..
మహిళ బిల్లుపై దేశవ్యాప్త అవగాహన కల్పించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికి ఉన్న ఈ ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల వ్యాప్తంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు..
ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళ బిల్లు చర్చకు రానుంది. మూడు రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మహిళా రిజర్వేషన్లను 2029 సాధారణ ఎన్నికల నుంచి అమల్లోకి తీసుకురావాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు, నియోజకవర్గాల పునర్విభజనకు బీజేపీ సర్కార్ సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్యను 50 శాతం వరకు పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపారు.
మహిళా రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయాలు..
మహిళా రిజర్వేషన్లకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నప్పటికీ, అమలు చేసే విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పార్టీలు 2011 గణాంకాల కంటే, 2026 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెంచడం వల్ల దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనల నేపథ్యంలో 2026 లెక్కల ప్రాధాన్యతను విపక్షాలు నొక్కి చెబుతున్నాయి. పార్లమెంటులో మహిళ బిల్లు ఆమోదం పొందిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహించి, మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ భావిస్తోంది. 2029 ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే ఈ చట్ట సవరణ బిల్లు భారత ప్రజాస్వామ్యంలో ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ కీలక బిల్లుపై పార్లమెంటులో ఎలాంటి చర్చ జరుగుతుందోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
మీడియాపై దాడులకు పాల్పడటం సరికాదు: వెంకయ్య నాయుడు
పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు: బుద్దా వెంకన్న
Read Latest AP News And Telangana News And International News And Telugu News