వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాల వాసుల గల్లంతు
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:45 PM
వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్, జులై 11 (ఆంధ్రజ్యోతి): వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి (Vietnam Boat Tragedy) గురికావడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫు క్వాక్ ద్వీప సమూహంలోని ఆన్తోయ్ సమీపంలోని హోన్ మే రూట్(Han May Rut) ప్రాంతంలో పర్యాటకులతో వెళ్తున్న బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది భారతీయ పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. పలువురు గల్లంతవగా.. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బోటులో మొత్తం 32 మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్లు వియత్నాం అధికారులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం వియత్నాం కోస్ట్ గార్డ్, స్థానిక రెస్క్యూ బృందాలు వేగంగా సహాయక చర్యలు చేపట్టి 21 మందిని సురక్షితంగా రక్షించాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కిషోర్ కుటుంబం కూడా చిక్కుకుంది. ఈ ఘటనలో ఆయన భార్య మృతిచెందినట్లు సమాచారం. కిషోర్ అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ ఘటనపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయమందించేందుకు అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైల్ప్‌లైన్లు:
అత్యవసర సహాయం కోసం +84 36 281 7930, +84 91552 37 14 , +84 33 452 0414, +84 91 308 9165 ఈ నంబర్లను సంప్రదించాలని భారత ఎంబసీ సూచించింది.
ఈ పర్యటనను ప్రముఖ సెల్‌ఫోన్ కంపెనీ తన వ్యాపార భాగస్వాముల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విహారయాత్రలో భాగంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయుల పెద్ద బృందం వియత్నాంకు వెళ్లినట్లు సమాచారం. 3 బోట్లలో విహారయాత్రకు 250 మంది డిస్ట్రిబ్యూటర్లు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిలో 40 మంది తెలంగాణ, 35 మంది ఏపీకి చెందిన మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. అయితే, మునిగిపోయిన బోటులో 70 మందికి పైగా మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై వియత్నాం సముద్ర భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు.
వియత్నాం బోటు ప్రమాదంపై మంత్రి లోకేశ్ ఆరా..

వియత్నాంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఢిల్లీలోని ఏపీభవన్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బోటు ప్రమాదంలో ఏపీకి చెందిన వారు ప్రాణాపాయంలో చిక్కుకున్నారనే సమాచారంపై వెంటనే మంత్రి ఆరా తీశారు. ఏపీ నుంచి విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులు ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోందని అధికారులు వివరించారు.
బోటు ప్రమాదంపై వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్రం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని లోకేశ్ సూచించారు. ఈ ప్రమాదంలో 19 మందికిపైగా మృతి చెందినట్లు సమాచారం ఉందని తెలిపారు. మృతుల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతానికి చెందినవారు ఉన్నారని వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని లోకేశ్‌కు అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News