ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:12 PM
ప్రకాశం జిల్లాలోని గర్భకండ్రిక భూముల సమస్య పరిష్కారంపై 8 గ్రామాల రైతులతో కొండపిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. గర్భకండ్రిక భూ సమస్యల గురించి జిల్లా కలెక్టర్ రాజాబాబు సీఎంకు వివరించారు.
ప్రకాశం జిల్లా, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని గర్భకండ్రిక భూముల సమస్య పరిష్కారంపై 8 గ్రామాల రైతులతో కొండపిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శుక్రవారం) ముఖాముఖి నిర్వహించారు. గర్భకండ్రిక భూ సమస్యల గురించి జిల్లా కలెక్టర్ రాజాబాబు సీఎంకు వివరించారు. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. నర్సింగోలులో రైతుల కష్టాలను చంద్రబాబు స్వయంగా విన్నారు. దశాబ్దాలుగా గర్భకండ్రిక భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట కల్పించామని సీఎం స్పష్టం చేశారు. ఆ భూముల రైతులకు రైత్వారి పట్టాలు జారీ అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ప్రకాశం జిల్లాలో 1,301 మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
4 మండలాల్లో 2,915.10 ఎకరాల భూములకు పరిష్కారం..
4 మండలాల్లోని 8 గ్రామాల్లో 2,915.10 ఎకరాల భూములకు సీఎం చంద్రబాబు పరిష్కారం చూపించారు. రైతుల భూ హక్కుల గుర్తింపునకు చారిత్రక రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. 1959 నాటి ఫారం-2 రికార్డుల ఆధారంగా భూముల వివరాలను పరిశీలించారు. ఇనాం భూముల సమస్య పరిష్కారానికి చట్టబద్ధ ప్రక్రియ చేపడుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో సాగు చేస్తున్న రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించారు. వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో భూముల వివరాల సవరణకు అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూముల రిజిస్ట్రేషన్లు, వ్యవసాయ రుణాలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. పంటల బీమా, సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలు పొందేందుకు రైతులకు మార్గం సుగమం చేశారు.
జరుగుమిల్లి మండలంలో 1260 ఎకరాల భూమికి పట్టాలు జారీ..
నర్సింగోలు గ్రామంలోనే 209 మంది రైతులకు 400.24 ఎకరాల మేర పట్టాలు జారీ చేశారు. కొండపి మండలంలో ఇలవర, వెన్నూరు గ్రామాల్లో 281 మంది రైతులకు 1003 ఎకరాలకు హక్కులను కల్పించారు. జరుగుమిల్లి మండలంలో పచ్చవ, వర్దినేనిపాలెం, నర్సింగోలు, కె.బిట్రగుంట గ్రామాల్లో 569 మందికి 1260 ఎకరాల భూమికి పట్టాలు జారీ చేశారు. నాగులుప్పలపాడు మండలం ఓబన్నపాలెంలో 430 మందికి 567 ఎకరాల మేర పట్టాలు పంపిణీ చేశారు. సింగరాయకొండ కలికివాయలో 21 మందికి 62 ఎకరాల మేర పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు భూములపై హక్కులు కల్పించటంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత వచ్చిందని సీఎం వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు ముఖ్యమంత్రి పరిష్కరించడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గర్భకండ్రిక భూములకు పట్టాలు పంపిణీ చేసిన సీఎంకు అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్‌ను మరింత ఉన్నతస్థాయికి మోదీ తీసుకెళ్తున్నారు: లోకేశ్
భోగాపురంతో ఉత్తరాంధ్ర మినీ ఎకనామిక్ సిటీగా మారుతుంది: రామ్మోహన్
హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి రైతుల భాగస్వామ్యం కీలకం: నాగబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News