Share News

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

ABN , Publish Date - Sep 20 , 2026 | 01:41 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తనపై చేసేవి చెత్త ఆరోపణలని ధ్వజమెత్తారు.

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు:  మంత్రి నారాయణ
AP Minister Narayana

నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (AP Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు తనపై చేసేవి చెత్త ఆరోపణలని ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లాలోని దొంతాలి లెగసీ వేస్ట్ ప్లాంటును మంత్రి నారాయణ ఈరోజు (ఆదివారం) పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. చెత్తని కాలుస్తున్నారని వైసీపీ నేతలు అవివేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చదువుకున్న వారు కూడా అజ్ఞానంతో మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. చెత్తకుప్పలో బయోగ్యాస్ తయారై మంటలు వస్తాయని తెలిపారు. మిథైన్ 65 శాతం ఉండటంతో ఈ చెత్త తగలపడుతోందని చెప్పుకొచ్చారు.


అవినీతికి పాల్పడాల్సిన అవసరం నాకు లేదు..

ప్రజలను తప్పుదారి పట్టించేందుకే వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జగన్ అండ్ కో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. అవినీతికి పాల్పడ్డానని తనపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. డబ్బే కావాలనుకుంటే నారాయణ విద్యాసంస్థలు చూసుకొంటే చాలని తెలిపారు. 2019లో నారాయణ విద్యాసంస్థల టర్నోవర్ ఏడాదికి రూ.2500 కోట్లు అని వెల్లడించారు. 2024కి దాన్ని రూ.6500 కోట్ల టర్నోవర్‌కి పెంచి తన పిల్లలకు అప్పగించానని తెలిపారు.


పేదరికం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను..

పేదరికం నుంచి వచ్చి తాను ఈ స్థాయికి ఎదిగానని మంత్రి నారాయణ వెల్లడించారు. పేదల కష్టాలను స్వయంగా చూశానని ప్రస్తావించారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి తాను వచ్చానని తెలిపారు. పేదల అభ్యున్నతికి తన వంతుగా కృషిచేస్తున్నానని అన్నారు. పేద పిల్లలకు విద్యను ఆస్తిగా ఇవ్వాలని కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ స్కూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. భగత్ సింగ్ కాలనీ, సర్వేపల్లి కాలువకట్ట వాసులకు శాశ్వత పట్టాలు ఇప్పించానని చెప్పారు. ఓర్వలేక వాటిపైనా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అండ్ కో ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదని మంత్రి నారాయణ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 02:09 PM