మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం
ABN , Publish Date - Jul 30 , 2026 | 08:35 AM
మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు.
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. ఇంటింటికీ వెళ్లి చెప్పండి
నేతలు క్రమశిక్షణతో పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ ఇస్తాం
జగన్ భోగాపురాన్ని గాలికొదిలేశారు.. ఇప్పుడు తనదే గొప్పని చెబుతున్నారు.. డీఎస్సీపై చర్చకు ఎక్కడైనా సిద్ధం
కర్నూలు నా గుండెల్లో ఉంటుంది.. కార్యకర్తల భేటీలో లోకేశ్
కర్నూలు, జూలై 29(ఆంధ్రజ్యోతి): మరో 15 ఏళ్లపాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటే.. నవ్యాంధ్రలో స్వర్ణయుగం సాకారం అవుతుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. కర్నూలు జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన బుధవారం రాత్రి ఆదోని నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీడీిపీకి కార్యకర్తలే అధినేతలు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య మనందరికీ స్ఫూర్తి. క్రమశిక్షణతో బాధ్యతగా పని చేయండి. మేమే వెతుక్కుంటూ వచ్చి పదవులు ఇస్తాం.’’ అని అన్నారు. టీడీపీ శాశ్వతమని, ఈ విషయాన్ని ప్రతి కార్యకర్తా గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
‘‘2019-24 మధ్య ఎన్నో కష్టాలు పడ్డారు. ప్రాణాలకు తెగించి పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో మీ కష్టాన్ని మరువలేం. రాష్ట్రంలో మరో మూడు పర్యాయాలు అధికారం చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చవచ్చు. టీడీపీ చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి బూత్ స్థాయి నుంచి క్లస్టర్ స్థాయి వరకు నాయకులు ప్రజల వద్దకు వెళ్లాలి. మనం చేసిన మంచి పనులు వివరించాలి. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ‘మై టీడీపీ యాప్’లో అప్‌లోడ్ చేయాలి. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ. గతంలో మీపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్కొక్కటిగా తీసేస్తున్నాం. సమస్యలు ఉంటే నాయకుల దృష్టికి తెస్తే వాటిని పరిష్కరిస్తారు. త్వరలోనే ప్రతి కార్యకర్తకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, విధ్వంసం చేసి వెళ్లింది. అలాంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుతూనే.. మరో వైపు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. ప్రధాని మోదీ సహకారంతో మరింత అభివృద్ధి సాధిస్తున్నాం.’’ అని అన్నారు.
నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు
‘‘నేను టెన్త్ తప్పిన బ్యాచ్ కాదు. స్టాన్‌ఫర్ట్ గ్రాడ్యుయేట్‌ని. గ్రూప్-1 పేపర్ల లీకేజీ, మద్యం కుంభకోణంపై కూడా చర్చిద్దాం. మొన్న నేను జగన్‌కు చాలెంజ్ చేస్తే ‘చెంచాలు’ బయటకొచ్చారు. సీబీఐ విచారణ కావాలంటున్నారు. అంత ప్రేమ ఉంటే బాబాయి హత్య కేసులో ఎందుకు స్టే తెచ్చుకున్నారు?. అధికారంలో ఉన్న ఐదేళ్లలో జగన్ భోగాపురం వైపు ఒక్కసారి కూడా తొంగి చూడలేదు. ఇప్పుడు నేను తెచ్చానని అంటున్నారు. లండన్ మందులు సరిగా పనిచేయడంలేదు. మరికొద్ది రోజులు పోతే ఆగస్టు 15న మా తాత స్వాతంత్య్రం తెచ్చాడని చెబుతారేమో. ఇది క్రెడిట్ చోరీ డిజార్డర్, సైకో హయాంలో సీమలో గొడ్డలి రాజ్యమేలింది, బాబాయిని లేపేసి ఆ నెపం మనపై వేశారు. ఆ ఫలితంగానే మనం ఓటమి పాలయ్యాం. మనం జొన్నగిరి గోల్డ్ పరిశ్రమను తెస్తే వారు బ్రాహ్మణి స్టీల్ కుంభకోణానికి పాల్పడ్డారు.
టీడీపీపై అంతులేని అభిమానం
తెలంగాణ రాష్ట్రం వనపర్తి నియోజకవర్గం కిలగనపురం గ్రామానికి చెందిన నాయకుడు బండారి యాదగిరికి టీడీపీ అంటే ఎంతో అభిమానం. ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చిత్రాలను తన ఛాతీపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఆదోనిలో టీడీపీ కార్యక్రమానికి హాజరై లోకేశ్‌ను కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
మై డియర్ జగన్..!
రాష్ట్రంలో పలుమార్లు డీఎస్సీ నిర్వహించి 2 లక్షల పోస్టులు భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని లోకేశ్ తెలిపారు. ‘‘జగన్‌కు టీచర్లు అంటే గిట్టదు. మనమెంతో ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ-2024 నిర్వహించి 16 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేస్తే.. ఆ పోస్టులు రద్దు చేయాలని జగన్ పార్టీ నేతలు కోర్టుకు వెళ్తున్నారు. మై డియర్ జగన్.. నేను చాలెంజ్ చేస్తున్నా.. డీఎస్సీపై చర్చకు సిద్దమైతే రా..! డీఎస్సీతో పాటు మీ హయాంలో జరిగిన గ్రూప్-1 పరీక్షలు కూడా చర్చిద్దాం. మనం పలు పరిశ్రమలు తెచ్చాం. జగన్.. ఈ సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ’’ అని విమర్శలు గుప్పించారు.
వార్తలు కూడా చదవండి...
చంద్రబాబు దూరదృష్టితో కుప్పంకు ఇజ్రాయిల్ టెక్నాలజీ: నారా భువనేశ్వరి
జీవ వైవిధ్య పరిరక్షణలో పులుల పాత్ర అమోఘం: పవన్ కల్యాణ్
ఏపీ మద్యం స్కాం.. కారుమూరికి సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News