విజయవాడలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐసిస్ నెట్‌వర్క్ గుట్టురట్టు
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:09 PM
విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు.
విజయవాడ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఇది కేవలం స్థానిక అంశం మాత్రమే కాక, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న భద్రతాపరమైన విషయమని పోలీసులు గుర్తించారు. విజయవాడ వంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి నెట్‌వర్క్ బయటపడటం భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం 42 మంది సభ్యుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విజయవాడలో పట్టుబడిన ముగ్గురు యువకులను విచారించగా, వారు సామాన్య నేరస్థులు కాదని, దేశవ్యాప్త, అంతర్జాతీయ ఉగ్రవాద సానుభూతిపరులతో సంబంధాలు కలిగి ఉన్నారని తేలింది. వీరి వెనుక ఉన్న భారీ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ఏడు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విచారణలో సంచలన అంశాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశంలోని 7 రాష్ట్రాలు(ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ) వంటి ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది యువకులతో ఒక రహస్య సోషల్ మీడియా గ్రూప్ నడుస్తోంది. ఈ గ్రూప్ ద్వారా ఐసిస్ (ISIS), కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారు. వీరంతా ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్నారు. భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలనేది వీరి ప్రధాన సంభాషణల సారాంశమని పోలీసులు గుర్తించారు. జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెట్టి ఫొటోలు దిగడం వీరి తీవ్రవాద ధోరణికి నిదర్శనమని పోలీసులు తెలిపారు.
అంతర్జాతీయ సంబంధాలు, శిక్షణ..
పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ వంటి దేశాల్లో ఉన్న ఉగ్రవాద సంస్థలతో వీరు నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నారు. భారతీయ యువతను జిహాదీ వైపు మళ్లించి, శిక్షణ కోసం విదేశాలకు పంపేందుకు ఈ ముగ్గురు యువకులు ప్రోత్సహిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో కీలకమైన ఆడియో క్లిప్పింగ్‌లు, జిహాదీ మెసేజ్‌లు లభించాయి.
పోలీసుల హెచ్చరిక..
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాయి. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇలాంటి మిలిటెంట్ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. యువత సోషల్ మీడియాలో ఏయే గ్రూపుల్లో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని, పిల్లలు ఉగ్రవాదం వైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు
అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ
నా కుమారుడు మహేశ్ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News