Share News

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్

ABN , Publish Date - May 23 , 2026 | 12:35 PM

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు.

నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్: పయ్యావుల కేశవ్
Minister Payyavula Keshav

అమరావతి, మే 23: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పులివెందులలో వైఎస్ రాజారెడ్డి అకృత్యాలను వివరించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు బీజం వేసింది వైఎస్ కుటుంబం అయితే... జగన్ దాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ అరాచక రాజకీయాలపై యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్ బాధితుడు కాదని.. నిందితుడంటూ వ్యాఖ్యానించారు. జగన్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా కొత్త వాదన తెస్తారన్నారు. వివేకా హత్య కేసులో ఏం జరిగిందో నిక్కరు వేసుకున్న కుర్రాడు కూడా చెబుతాడని.. అలాంటి వాటిల్లో కూడా జగన్ అసత్యాలు చెబుతున్నారు’ అంటూ దుయ్యబట్టారు.


ఇదీ రాజారెడ్డి చరిత్ర..

వైఎస్ కుటుంబంతోనే రాజకీయాలు నేరమయ్యాయని.. రాజకీయాల్లోకి ఫ్యాక్షన్ తెచ్చారని మంత్రి మండిపడ్డారు. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీమలో ఫ్యాక్షనిజానికి అండగా నిలిచిందని ఆరోపించారు. నాటి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో పార్నపల్లి అనే గ్రామంలో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చిందని.. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతల ఇళ్లకు డ్రిల్ చేసి డైనమేట్లు పెట్టి పేల్చారని.. ఇదీ రాజారెడ్డి చరిత్ర అని చెప్పుకొచ్చారు. ఓ ఇంటిని డైనమేట్లు పెట్టి పేల్చేసిన ఘటనను ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. తన ప్రత్యర్థుల మీద దాడి చేయించి... అదే సందర్భంలో వేరే చోట ఉన్నట్టు సృష్టించుకోవడం అనేది వైఎస్ కుటుంబంతోనే మొదలైందని అన్నారు.


ప్రజలకు నిజాలు చెప్పాలి..

కడప జిల్లాలోని లింగాల మండలంలో ముగ్గురు టాప్ లీడర్లను భయపెట్టి లొంగదీసుకున్నారని పయ్యావుల ఆరోపించారు. ఇలాంటివి పదుల సంఖ్యలో పులివెందులలో జరిగాయన్నారు. రాజారెడ్డి నుంచి మొదలుకుని పులివెందులలో జరిగిన ఘటనలపై పుస్తకం వేస్తామన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక సీమలో ఫ్యాక్షన్‌ కంట్రోల్లోకి వచ్చిందన్నారు. వైఎస్ కుటుంబం మొదలు పెట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలను కంట్రోల్ చేయడానికి 30 ఏళ్లు పట్టిందని తెలిపారు. రప్పా రప్పా అంటే వారితో ఫొటోలు దిగుతారని.. సొంత పార్టీ కార్యకర్త కారు కింద నలిగిపోయినా పట్టించుకోరని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ గొడ్డలి అంటే జగన్ మోహన్ రెడ్డి ఉలికిపాటుకు గురవుతున్నారన్నారు. గొడ్డలిపోటును గుండెపోటుగా చూపించగలరని దుయ్యబట్టారు. ‘నిజాలను ప్రజలకు చెప్పాలి... అవగాహన కల్పించాలి. అందుకే గొడ్డలి పార్టీ సమాజానికి హానికరం... గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్’ అని స్పష్టం చేశారు.


ముందు విచారించాల్సింది జగన్‌నే..

ఓ తరానికి ఉపాధి కల్పించేలా చంద్రబాబు అవకాశాలు సృష్టించారని పయ్యావుల కేశవ్ తెలిపారు. జగన్ ఉపాధి అవకాశాలను పోగొడుతున్నారని మండిపడ్డారు. 800 కంపెనీలను గ్రౌండ్ చేయబోతున్నామన్నారు. ‘వ్యవస్థల మీద గొడ్డలి పోటు వేశావ్.. పోలవరం మీద గొడ్డలి వేటు వేశావ్.. పరిశ్రమల మీద గొడ్డలి వేటు వేశావ్.. అందుకే మీది గొడ్డలి పార్టీ. అచ్చెన్న అరెస్ట్ నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు భయం సృష్టించే ప్రయత్నం చేశారు. పొక్లెయిన్లతో జగన్ విధ్వంసం చేస్తే... నిర్మాణానికి పొక్లెయిన్లను వాడుతున్నాం. నేరం జగన్ నైజం.. నేరమయ రాజకీయాలను గతంలో వైఎస్ కుటుంబం మొదలు పెట్టింది.. దాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. వివేకాను చంపిందెవరో సునీతమ్మ చెబుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక రిలయన్స్ ఉందన్నారు. తిరిగి వారికే రాజ్యసభ పదవి ఇచ్చారు. వైఎస్ మరణం వెనుక జగన్ పాత్ర ఉందని బొత్స అన్నారు. దానికి సమాధానం చెప్పగలరా..? వైఎస్‌ఆర్‌ను ముద్దాయిగా చేసింది జగనే అని ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయంగా చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముద్దాయిగా చేర్చిన పొన్నవోలుకు పదవి ఇచ్చి గౌరవించారు. పాదయాత్రలో అస్వస్థత గురైనప్పుడు విజయమ్మ వెళ్లారు కానీ... జగన్ వెళ్లలేదు. వైఎస్ మరణం వెనుక ముందుగా విచారించాల్సింది జగన్ మోహన్ రెడ్డినేనని లగడపాటి అన్నారు’ అని గుర్తు చేశారు. యువకులు తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని.. ఎవరి చరిత్ర ఏంటో.. యువకులు తెలుసుకోవాలని సూచించారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం చంద్రబాబు పరిశ్రమలు తెస్తున్నారని... జగన్ పరిశ్రమలను తరిమేశారంటూ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

2027 నాటికి శంకర్ విలాస్ బ్రిడ్జి పూర్తి: కేంద్ర మంత్రి పెమ్మసాని

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2026 | 12:58 PM