Share News

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

ABN , Publish Date - Apr 13 , 2026 | 09:48 AM

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్
YS Vivekananda Reddy Case

హైదరాబాద్, ఏప్రిల్13 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy Case) దర్యాప్తు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేలా కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను వివేకా కూతురు సునీతా రెడ్డి దాఖలు చేశారు. ఈ కేసులో కొన్ని కోణాలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదని, పలు అనుమానాలకు సమాధానాలు రాలేదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువల్ల మరింత సమగ్ర తదుపరి దర్యాప్తు జరపాలని హైకోర్టును కోరారు.


పిటిషనర్ అసంతృప్తి..

ఈ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తులో ఉంది. గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కొన్ని వ్యక్తుల మధ్య జరిగిన ఫోన్ కాల్ డేటా సహా పలు సాంకేతిక ఆధారాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టింది. తదుపరి దర్యాప్తులో కొందరి పాత్ర లేదని పేర్కొంటూ సీబీఐ కోర్టుకు ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. అయితే ఈ దర్యాప్తుపై పిటిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.


పిటిషనర్ వాదనలు

సునీతా రెడ్డి తన పిటిషన్‌లో పలు కీలక విషయాలను పేర్కొన్నారు. పలు సందేహాలకు సీబీఐ దర్యాప్తులో సమాధానం రాలేదని తెలిపారు. కొన్ని కోణాల్లో విచారణ పూర్తిగా జరగలేదని అన్నారు. ఈ కేసులోని కొన్ని అనుమానాస్పద అంశాలను విస్మరించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందువల్ల సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి, కేసులో ఇంకా స్పష్టత లేని అంశాలపై మరింత దర్యాప్తు చేయాలని ఆదేశించాలంటూ ఆమె హైకోర్టును అభ్యర్థించారు.


నేడు విచారణ..

ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు(సోమవారం) విచారణ జరుగుతోంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వివేకానంద రెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ తాజా పిటిషన్‌తో వివేకా కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. కోర్టు నిర్ణయం ఈ కేసు తదుపరి దశను నిర్దేశించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

బెట్టింగ్‌, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

వైద్య రంగంలో సమూల మార్పులు: మంత్రి సత్య కుమార్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 13 , 2026 | 11:30 AM