Share News

వడగాలుల అలర్ట్.. ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 06:46 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండ, వడగాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వడగాలుల అలర్ట్..  ఏపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు
Heatwave Alert

అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తాజాగా వడగాలులపై హెచ్చరికలు జారీ చేశారు. (రేపు) సోమవారం, (ఎల్లుండి) మంగళవారం రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాలులు, సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండగా, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


పలు మండలాలపై వడగాలుల ప్రభావం..

సోమవారం మొత్తం 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 49 మండలాల్లో సాధారణ వడగాలులు ప్రభావం చూపనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీవ్ర వడగాలుల ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాలు, విజయనగరం జిల్లాలో 18 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక మండలం, పోలవరం ప్రాంతంలో 3 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 3 మండలాలు, ఏలూరు జిల్లాలో 2 మండలాల్లో ఉండే అవకాశం ఉందని తెలిపారు. అలాగే సాధారణ వడగాలుల ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో 2 మండలాలు, విజయనగరంలో 5, అల్లూరి జిల్లాలో 4, పోలవరం ప్రాంతంలో 9, అనకాపల్లి జిల్లాలో 5, కాకినాడ జిల్లాలో 5, తూర్పుగోదావరి జిల్లాలో 9, ఏలూరులో 4, ఎన్టీఆర్ జిల్లాలో 3, పల్నాడు జిల్లాలో 2, నంద్యాల జిల్లాలో ఒక మండలంలో వడగాలుల ప్రభావం ఉండవచ్చని అధికారులు తెలిపారు.


ఆదివారం తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు..

ఈరోజు(ఆదివారం) ఏపీలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల సెల్సియస్, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 42.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లెలో 42.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా గూడూరులో 42.1 డిగ్రీలు, పల్నాడు జిల్లా దుర్గిలో 41.8 డిగ్రీలు, శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 41.6 డిగ్రీలు, మార్కాపురం ప్రాంతం అనుమలపల్లి, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 41.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 41.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు తగ్గించాలని కోరారు.


ప్రజలకు సూచనలు - జాగ్రత్తలు..

ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ లేదా రుమాలు ధరించాలి. లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించడం ఉత్తమం. కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ వాడాలి. వేడి గాలి నేరుగా చెవుల్లోకి వెళ్లకుండా కప్పుకోవాలి. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బీపీ ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.


ఆరోగ్యం, ఆహారం

శరీరం డీహైడ్రేషన్ (నీటి శాతం) తగ్గకుండా ఉండటానికి మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ముఖ్యంగా గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకుండా జాగ్రత్త పడాలి. సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు. పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు ఎండలో ఎక్కువసేపు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ హెచ్చరికలను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ వంటి ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 07:12 PM