Share News

పెళ్లింట తీరని విషాదం.. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు తండ్రి

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:42 AM

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్‌పల్లిలో పెళ్లింట విషాదం నెలకొంది. రెండు రోజుల్లో కొడుకు వివాహం జరగాల్సి ఉండగా సరుకుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో పెళ్లి కొడుకు తండ్రి దుర్గయ్య మృతిచెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

పెళ్లింట తీరని విషాదం.. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు తండ్రి
Tragedy in Kamareddy

కామారెడ్డి, ఏప్రిల్11 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులకు జీవితంలో అతిపెద్ద సంతోషం అంటే అది తన పిల్లల వివాహం జరిపించటమే. ఏ తండ్రికైనా తన కొడుకు పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడవుతుంటే చూసి మురిసిపోవాలని ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో సరిగ్గా అలాంటి ఓ శుభకార్యానికి అంతా సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో బాజాలూ మోగాలి, బంధుమిత్రుల సందడి మొదలవ్వాలి. కానీ, విధి ఆ కుటుంబంపై పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ ఇంట్లో పెళ్లి బాజాలకు బదులు చావు డప్పులు మోగాయి.


ఏం జరిగిందంటే..

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షెట్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య కుటుంబంలో ప్రస్తుతం వివాహ వేడుకలు జరుగుతున్నాయి. దుర్గయ్య కుమారుడి వివాహం మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉంది. కొడుకు పెళ్లిని ఘనంగా జరిపించాలని, ఎక్కడా లోటు రాకూడదని ఆ తండ్రి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇంటి నిండా బంధువులు, స్నేహితులు రాకతో సందడి నెలకొంది. పెళ్లి పనుల్లో భాగంగా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రిని తీసుకురావడానికి దుర్గయ్య తన బైక్‌పై బయలుదేరాడు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో అతివేగంగా వచ్చిన ఓ లారీ ఆయన ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది.


అక్కడికక్కడే మృతి..

ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే, లారీ ఢీకొట్టిన ధాటికి దుర్గయ్య బైక్‌పై నుంచి ఎగిరి దూరంగా పడిపోయారు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.


మిన్నంటిన రోదనలు..

మరణవార్త తెలిసిన వెంటనే షెట్‌పల్లి గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. మరో రెండు రోజుల్లో తన కుమారుడిని వివాహాన్ని జరిపించాల్సిన తండ్రి ఆ ఇంటికి శవమై రావడాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోయారు. సరుకులు తీసుకురావడానికి వెళ్లి ఇలా తిరిగిరాని లోకాలకు తన తండ్రి వెళ్లడం చూసి కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి అండతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్న ఆ కొడుకుకి, తండ్రి పాడెను మోయాల్సిన పరిస్థితి రావడం గ్రామస్థులందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో షెట్‌పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంతోషంగా సాగాల్సిన పెళ్లి వేడుక కాస్తా మృత్యు వేడుకగా మారిపోయింది. అతివేగం, అజాగ్రత్త కారణంగా రోడ్లపై జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగులుస్తున్నాయి. తండ్రి అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతారహితంగా వాహనం నడిపిన లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 10:15 AM