Share News

ఆశా భోంస్లే మృతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాళి

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:12 PM

ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. సినిమా రంగానికి ఆమె అందించిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు.

ఆశా భోంస్లే మృతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ నివాళి
Asha Bhosle Tribute

అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే (92) (Asha Bhosle) తుది శ్వాస విడిచారు. నిన్న (శనివారం) సాయంత్రం ఆమె అస్వస్థతకు లోనయ్యారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించగా ఈరోజు (ఆదివారం) తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సినిమా రంగానికి ఆశా భోంస్లే చేసిన సేవలను కొనియాడారు.


ఆశాభోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి: సీఎం చంద్రబాబు

ప్రముఖ గాయని ఆశాభోంస్లే మరణవార్త విని తీవ్రంగా విచారించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒక దిగ్గజ, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, భారతీయ గాయనిగా ఆమె పేరు సంపాదించారని కొనియాడారు. సంగీత పరిశ్రమకు ఆమె చేసిన అసాధారణమైన సేవలు ఏడు దశాబ్దాలకు పైగా విస్తరించి ఉన్నాయని తెలిపారు. ఆమె పాడిన పాటలు తరతరాలను సుసంపన్నం చేశాయని అన్నారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత అయిన ఆమె వారసత్వం భారతదేశ సంగీత వారసత్వంలో ఒక అంతర్భాగంగా నిలిచి, యుగయుగాల పాటు ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.


ఆశా భోంస్లే యువతను ఉర్రూతలూగించారు: పవన్ కల్యాణ్

ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోంస్లే కన్నుమూశారని తెలిసి చింతించానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆశాజీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. మధుర గాయనిగా సుదీర్ఘ కాలం హిందీతోపాటు మరాఠీ, తెలుగు, బెంగాలీ వంటి భాషల్లో సినీ గీతాలు ఆలపించారని కొనియాడారు. పాశ్చాత్య సంగీత శైలి గీతాలను ఆలపించి ఒక తరం యువతను ఉర్రూతలూగించారని అన్నారు. దమ్ మారో దమ్, చురా లియా హై తుమ్నే, ఇన్ అంకో కి మస్తీ, రాధా కైసే న జలే ఇలాంటి గీతాలతో సినీ, సంగీతాభిమానులను అలరించారని కీర్తించారు. తెలుగులో ఆశాజీ పాడిన గీతాలు తక్కువే అయినా హిందీ గీతాలతో తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమేనని చెప్పారు. ఆశా భోంస్లే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఆశా భోంస్లే పాట రూపంలో జీవించే ఉంటారు: నారా లోకేశ్

భారతీయ భాషల్లో 80 ఏళ్ల పాటు తన సుమధుర స్వరంతో వీనుల విందైన పాటలు అందించిన లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే అని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఆశాజీ భౌతికంగా మనకు దూరమైనా ఆమె పాట రూపంలో జీవించే ఉంటారని కీర్తించారు.  మహా గాయని మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 04:29 PM