Share News

బెట్టింగ్‌, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:29 PM

బెట్టింగ్‌,జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీలో ఆన్‌లైన్ గేమింగ్ పేరిట జరుగుతున్న బెట్టింగ్, జూద కార్యకలాపాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు.

బెట్టింగ్‌, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు.. డీజీపీ వార్నింగ్
AP DGP Harish Kumar Gupta

అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌, జూద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) హెచ్చరించారు. ఏపీలో ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో జరుగుతున్న బెట్టింగ్, జూద కార్యకలాపాలు పూర్తిగా నిషేధమని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈరోజు(ఆదివారం) డీజీపీ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ నేపథ్యంలో ఏపీవ్యాప్తంగా క్రికెట్ బెట్టింగ్, జూద కార్యకలాపాల నిరోధంపై జీరో టోలరెన్స్ విధానంతో కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.


బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై ముమ్మర దాడులు..

రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ నెట్‌వర్క్‌లపై దాడులు ముమ్మరం చేశామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా ఉన్న పలు క్లబ్‌లను మూసివేశామని చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లను గుర్తించామని అన్నారు. సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుంటూ బ్లాక్ చేసే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బుకీలు, ఏజెంట్లు, బెట్టింగ్‌లో పాల్గొనే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేరాలను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా పరిగణించి బీఎన్ఎస్ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఇప్పటికే గుర్తించి ఫ్రీజ్ చేస్తున్నామని అన్నారు.


ఆస్తులను చట్టప్రకారం అటాచ్ చేస్తాం..

చట్టాలను ఉల్లంఘిస్తూ పదే పదే గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నేరస్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్, చర్యలు తీసుకోవాలని పోలీసులకు డీజీపీ ఆదేశించారు. బెట్టింగ్ ద్వారా సంపాదించిన, ఉపయోగిస్తున్న ఆస్తులను గుర్తించి చట్ట ప్రకారం అటాచ్ చేస్తామని తెలిపారు. ఐపీఎల్ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా లాడ్జీలు, హోటళ్లు, పబ్లిక్ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయని వివరించారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లపై నిరంతర నిఘా పెట్టామని చెప్పారు. యువతకు బెట్టింగ్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. బెట్టింగ్, జూదాలకు ప్రజలు దూరంగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఘనంగా బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ వేడుకలు..

చట్టాలు, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది: అనిత

జువ్వలదిన్నె హార్బర్‌పై అసత్య ప్రచారాలు నమ్మొద్దు: సోమిరెడ్డి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 12 , 2026 | 09:59 PM