Share News

జగన్ పాపం పండింది.. అందుకే 11 సీట్లు.. పార్థసారథి రెడ్డి ఎద్దేవా

ABN , Publish Date - May 23 , 2026 | 12:59 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రిలయన్స్‌ ఆస్తులను ధ్వంసం చేయలేదా? అని ప్రశ్నించారు.

జగన్ పాపం పండింది.. అందుకే 11 సీట్లు.. పార్థసారథి రెడ్డి ఎద్దేవా
Perla Parthasaradhi Reddy

కడప, మే 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) పులివెందులకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి (Perla Parthasaradhi Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రిలయన్స్‌ ఆస్తులను ధ్వంసం చేయలేదా..? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక రిలయన్స్‌ వారికే రాజ్యసభ ఇవ్వలేదా..? అని నిలదీశారు. సతీశ్‌రెడ్డి, ఆయన అనుచరుల హత్యకు ప్రయత్నం చేశారని విమర్శించారు. సతీశ్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా అందరిపై కేసులు పెట్టారని ప్రస్తావించారు. ఈరోజు (శనివారం) కడప వేదికగా పేర్ల పార్థసారథి రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. తన గుండెలో దాగి ఉన్న బాధను చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. 1996లో తనపై హత్యాయత్నం చేశారని గుర్తుచేశారు. తన తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డి కేసులో.. ఈసీ గంగిరెడ్డి, భాస్కర్‌రెడ్డి ముద్దాయిలు కాదా..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని గొడ్డలితో నరికి చంపి శత్రువులను కూడా భయపెట్టలేదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. వివేకా హత్య తర్వాత ఆయన కుమార్తె సుప్రీంకోర్టుకు వెళ్తుంటే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. వైఎస్ షర్మిలకు ఆస్తి ఇవ్వకుండా జగన్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహించారు.


జగన్ చెప్పేవి అసత్యాలు..

తన తాతను చంపిన వారిని వదిలేశానని జగన్ రెండు రోజుల క్రితం చెప్పారని పార్థసారథి రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ చెప్పేవి అసత్యాలు, అభూత కల్పనలేనని విమర్శించారు. వైఎస్ కుటుంబం జీవితం ప్రారంభించిందే దాడులు, దౌర్జన్యాలతో అని ఆరోపించారు. 1996లో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీ నుంచి తాను నిలబడ్డానని చెప్పుకొచ్చారు. వైఎస్‌ను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లానని ప్రస్తావించారు. 1996లో వైఎస్ రాజారెడ్డి దగ్గరుండి తనపై కత్తులతో దాడి చేయించారని మండిపడ్డారు. ఈ కేసులో నాటి ఏఎస్పీ పీవీ సునీల్ కుమార్ ముద్దాయిని పట్టుకున్నారని గుర్తుచేశారు.. తనపై దాడి కేసులో రాజారెడ్డి ఏ1గా ఉన్నారని ప్రస్తావించారు. జగన్ పెళ్లికి రాజారెడ్డి షరతులతో కూడిన బెయిల్‌తో హాజరయ్యారని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మైనింగ్ యజమాని వెంకట నరసయ్యను హతమార్చారని ఆరోపించారు. ఈ హత్య కేసులో రాజారెడ్డితో పాటూ జార్జిరెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పారు. అప్పటి మంత్రి రహ్మతుల్లా మైనింగ్‌లను వైఎస్ కుటుంబం అక్రమంగా దోచుకుందని ఆరోపించారు.


ఓ పోలింగ్ కేంద్రంలో వైఎస్ కాల్పులు జరిపారు..

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ కుటుంబానికి రూ.50 లక్షల పెనాల్టీ వేశారని పార్థసారథి రెడ్డి తెలిపారు. జమ్మలమడుగులో ఓ పోలింగ్ కేంద్రంలో వైఎస్ కాల్పులు జరిపినందుకు కేసు నమోదు చేశారని అన్నారు. మాజీ మంత్రి శివారెడ్డిని హత్య చేయించింది వైఎస్ కుటుంబమేనని ఆరోపించారు. రాజారెడ్డి నుంచి జగన్ వరకూ.. కిరాయి హత్యలు, నమ్మక ద్రోహం సంక్రమించాయని ఎద్దేవా చేశారు. పులివెందులలో రాజకీయ అధిపత్యం సాగించేందుకు అనేక దురాగతాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తమను తాము కాపాడుకునేందుకు వైఎస్ రాజారెడ్డిని హత్య చేయాల్సి వచ్చిందని ప్రస్తావించారు. వైఎస్ రాజారెడ్డి హత్య తర్వాత తన తమ్ముడు ఉమామహేశ్వర రెడ్డిని హత్య చేశారని చెప్పారు. తన తమ్ముడు హత్య కేసులో ఈసీ గంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. 1968లోనే వైఎస్ రాజారెడ్డిపై రౌడీ‌షీట్ నమోదైందని గుర్తు చేశారు. వైఎస్ జగన్ బాబాయ్ వివేకాను దారుణంగా హత్య చేయించారని చెప్పారు.


జగన్ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారు..

వైఎస్ వివేకాను చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి హత్య చేశారని జగన్ ఆరోపించారని పార్థసారథి రెడ్డి అన్నారు. వివేకా హత్య కేసులో జగన్ సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ లాంటి తమ్ముడు ఎవరికీ ఉండకూడదని చెప్పారు. వైఎస్ మరణం తర్వాత అంబానీపై.. జగన్ ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. జగన్ సీఎం అయ్యాక అదే కుటుంబానికి రాజ్యసభ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. తనను చంపేందుకు మద్దెలచెరువు సూరికి సుపారీ ఇచ్చారని ఆరోపించారు. తనను చంపితే పరిటాల రవిని చంపేందుకు సహకరిస్తామని సూరికి జగన్ హామీ ఇచ్చారని ప్రస్తావించారు. జగన్ పాపం పండంటంతోనే 11 సీట్లకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలన్నా, రాయలసీమ అభివృద్ధి చెందాలన్నా జగన్ జైల్లో ఉండాలని అన్నారు. జగన్ అక్రమాలు, అరాచకాలు ఆంధ్రప్రదేశ్‌లో గడప గడపకూ వివరిస్తానని పార్థసారథి రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ

తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 23 , 2026 | 01:23 PM