పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ABN , Publish Date - Nov 19 , 2026 | 09:23 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు.
కడప జిల్లా, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బీటెక్ రవి (B Tech Ravi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు. ఈరోజు (గురువారం) పులివెందులలో మీడియాతో రవి మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఏదో జరిగిపోతోందని సాక్షి ఛానల్, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నామినేషన్ల కోసం 21 మందికి పోలీసు రక్షణ కావాలని, నామినేషన్ కేంద్రాలను కడపకు మార్చాలని వైసీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు.
నామినేషన్ కేంద్రాలను మార్చడం సాధ్యం కాదని న్యాయస్థానం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులు (1+2) మాత్రమే లోపలికి వెళ్లేలా పోలీసు ఎస్కార్ట్‌ను కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. న్యాయస్థానం ఆర్డర్ రాత్రి 8 గంటలకు రాగా, అంతకుముందే సాయంత్రం 5 గంటలకే ఆ 21 మందిలో 13 మంది ఎలాంటి రక్షణ లేకుండానే ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేశారని అన్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తేనే వైసీపీ నేతలు కోర్టును, ఎన్నికల సంఘాన్ని (SEC) తప్పుదోవ పట్టించినట్లుగా తెలుస్తోందని పేర్కొన్నారు.
వైసీపీ నేతల తీరు హాస్యాస్పదంగా ఉంది..
పోలీసులు తమకు అడ్డుపడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని బీటెక్ రవి విమర్శించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి స్వయంగా 307 (హత్యాయత్నం) కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మద్ది నరసింహారెడ్డిని వెంటబెట్టుకుని డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లారని చెప్పారు. ముందస్తు అరెస్ట్ అయిన వారికి పూచీకత్తు ఇచ్చి అవినాశ్‌రెడ్డి విడిపించుకుని తీసుకెళ్లినట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని అన్నారు. వేంపల్లి ఆస్పత్రి పరామర్శలోనూ అవినాశ్‌రెడ్డి పక్కనే 307 కేసులో నిందితుడైన వేముల జడ్పీటీసీ భర్త పేర్నపాడు సాంబశివరెడ్డి కూర్చున్నారని, నిందితులు ఇలా స్వేచ్ఛగా తిరుగుతుంటే పోలీసులు ఎవరికి వత్తాసు పలుకుతున్నారని ప్రశ్నించారు.
నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చి హల్చల్ చేశారు..
చక్రాయపేటలో దాదాపు 300 మంది వైసీపీ కార్యకర్తలు ట్రాక్టర్లలో బీరు బాటిళ్లు, రాళ్లు, ఆయుధాలతో నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చి హల్చల్ చేశారని బీటెక్ రవి ధ్వజమెత్తారు. ట్రాక్టర్‌ను తమ కార్యకర్తలపైకి ఎక్కించడంతో ఇద్దరి కాళ్లు విరిగాయని, మరొకరి తలకు తీవ్ర గాయాలయ్యాయని, అయినప్పటికీ ఇప్పటివరకు ఆ ట్రాక్టర్‌ను, డ్రైవర్‌ను గానీ పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నామినేషన్ కేంద్రాల వద్దకు వందలాది మందిని అనుమతించలేమని పోలీసులు స్పష్టం చేశారని అన్నారు. కానీ సతీశ్‌రెడ్డి 300 నుంచి 400 మందితో కేంద్రం వద్దకు రావాలనుకుంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. పులివెందుల, వేంపల్లి మండలాల్లో చాలా వరకు నామినేషన్లు సజావుగా జరిగాయని, సింహాద్రిపురం మండలంలో అష్టమి తిథి కారణంగానే కొన్ని చోట్ల నామినేషన్లు వేయలేదని వివరించారు. చివరగా, 307 కేసుల్లో నిందితులుగా ఉన్న అరాచక శక్తులను తక్షణమే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ, పులివెందుల డీఎస్పీలను బీటెక్ రవి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ వేళ.. బాలయ్య ప్రశంసలు.!
ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. 145 కి.మీ వేగంతో బలమైన గాలులు..!
పంచాయతీ ఎన్నికలు.. ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News