Share News

స్థానిక ఎన్నికలు.. రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 20 , 2026 | 01:45 PM

స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు సూచించారు. రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, అధికారిక అభ్యర్థులకు వెంటనే బీఫాంలు అందజేయాలని ఆదేశించారు.

స్థానిక ఎన్నికలు.. రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

ఇంటర్నెట్ డెస్క్: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన రెబల్స్‌ వాటిని ఉపసంహరించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలను, ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు నేడు(మంగళ వారం) ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన దిశానిర్దేశం చేశారు.


స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కూటమి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు చంద్రబాబు. వ్యక్తిగత ప్రయోజనాలు, తాత్కాలిక రాజకీయ లబ్ధికోసం అదనపు అభ్యర్థులను బరిలోకి దించొద్దని ఆదేశించారు. పార్టీ తరఫున పోటీచేసే అధికారిక అభ్యర్థులకు వెంటనే బీఫాంలను అందజేసి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని స్పష్టం చేశారు.


కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేలా నేతలు ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. ఇంటింటి ప్రచారం సహా బూత్‌​ స్థాయి వరకు పార్టీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేసిన మంచిని గురించి వివరించి వారి మద్దతు కూడగట్టాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అధికార హోదాలను పక్కనపెట్టి క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. విలువల్ని వదిలేసి రౌడీయిజం, అధికార దుర్వినియోగంతో చేసే రాజకీయాలు ఎన్నటికీ నిలబడవన్న ఆయన.. పార్టీ క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తూ, వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషిచేయాలని ఆదేశించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపునిచ్చేందుకు ఇది మంచి అవకాశమని.. కష్టపడిన ప్రతిఒక్కరికీ పదవులు దక్కేలా చూస్తామన్నారు. కూటమి సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా కొందరికి పోటీచేసే అవకాశం రాకపోతే నామినేటెడ్‌ పదవుల్లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.


ఇవీ చదవండి:

రప్పారప్పా మనకొద్దు!

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

Updated Date - Oct 20 , 2026 | 01:45 PM