Share News

రప్పారప్పా మనకొద్దు!

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:56 AM

మళ్లీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరికేస్తామని గొడ్డలి పార్టీ నాయకులు అంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు

రప్పారప్పా మనకొద్దు!
CHANDRABABUNAIDU

  • మళ్లీ భయం నీడలో బతికే పరిస్థితికి తేవొద్దు: సీఎం

  • గొడ్డలి పార్టీ డీఎన్‌ఏలోనే హింస, నేరప్రవృత్తి

  • నేరస్థులు ఏ పార్టీలో ఉన్నా ఓటేయొద్దు

  • స్థానిక సంస్థల్లోనూ కూటమికే జై కొట్టండి

  • ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కార్‌.. ట్రిపుల్‌ వేగంతో అభివృద్ధి

  • అభ్యర్థుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం

  • నాడు పులివెందులలో నామినేషన్లు వేయనివ్వలేదు

  • నేడు అన్ని చోట్లా స్వేచ్ఛగా వేశారు: చంద్రబాబు

  • స్థానిక ఎన్నికల్లో ‘నాడు-నేడు’ వైసీపీ అరాచకాల వీడియోల ప్రదర్శన

అభ్యర్థుల ఎంపికలో ప్రజాభీష్టానికి ప్రాధాన్యమిచ్చాం. సోషల్‌ రీ-ఇంజనీరింగ్‌ చేపట్టాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 63.6 శాతం స్థానాలు కేటాయించాం. ఒక్క బీసీలకే 35 శాతానికిపైగా సీట్లు ఇచ్చి పెద్దపీట వేశాం.

కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు ఒకే తాటిపై ఉంటేనే అభివృద్ధి ముమ్మరంగా సాగుతుంది. ప్రజాస్వామ్య పునాదుల పటిష్ఠానికి.. స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మళ్లీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరికేస్తామని గొడ్డలి పార్టీ నాయకులు అంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. ఈ రప్పా రప్పా రాజకీయాలను ప్రోత్సహించవద్దని.. రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తీసుకురావొద్దని ప్రజలకు పిలుపిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే ధ్యేయంగా ఎన్‌డీఏ ప్రభుత్వం పనిచేస్తుంటే.. దాన్ని అడ్డుకునేలా గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను పురస్కరించుకుని సోమవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘బాగా పనిచేస్తామని చెప్పండి.. చేసిన తప్పులు సరిదిద్దుకోండి. అంతేతప్ప ఈ రప్పారప్పా సంస్కృతి వద్దు’ అని వైసీపీకి సూచించారు. దేశానికైనా.. రాష్ట్రానికైనా ఈ 20 ఏళ్లూ చాలా ముఖ్యమన్నారు. నేరస్థులు ఏ పార్టీలో ఉన్నా సరే ఓటు వేయవద్దని ఓటర్లను కోరారు. స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడానికి 60 పిటిషన్లు వేశారని.. బీసీ రిజర్వేషన్లను గొడ్డలి పార్టీ వ్యతిరేకించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.


babu.jpg‘ఈ సమయంలో మీరిచ్చే బలం, వేసే ఓటు మాకు మరింత శక్తిని ఇస్తుంది. ఇంకా వేగంగా పనిచేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుభవం కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఈ విషయాలను వివరించడం నా బాధ్యత’ అని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలతో స్థానిక నాయకత్వం బలపడుతుందన్నారు. ఈ ఎన్నికల్లోనూ ఎన్‌డీఏని గెలిపిస్తే.. అభివృద్ధి దూసుకెళ్తుందని, ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారుతో ట్రిపులింజన్‌ వేగంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సమర్థ నాయకత్వాన్ని అందించి.. ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపికలో ఎన్నడూ లేనంత కసరత్తు చేశామని తెలిపారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ఎలాంటి కసరత్తు చేశామో.. గ్రామీణ ఎన్నికల్లోనూ అదే స్థాయిలో కసరత్తు చేస్తామని తెలిపారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో ఆయారాం.. గయారాం సంస్కృతికి చెల్లు చీటీ పాడేలా మేయర్లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానం తెచ్చామని గుర్తుచేశారు. విద్యావంతులు, యువత, మహిళలు, పార్టీకి సేవలందించిన వారికే టికెట్లు ఇచ్చామని, ఒక్కో మేయర్‌ స్థానాన్ని ఒక్కో సామాజిక వర్గానికి కేటాయించామని తెలిపారు. గతంలో సీఈసీ ఎంపిక విధానానికి మద్దతిచ్చి తప్పు చేశామన్న జగన్‌ మాటలకు స్పందిస్తూ.. ఓటమి పాలయ్యేసరికి ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు. జగన్‌ హయాంలో స్థానిక ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ ఏకగ్రీవాలతోపాటు ప్రస్తుత ఎన్నికల్లోనూ గొడ్డలి పార్టీ నేతలు సాగిస్తున్న అరాచకాల వీడియోలను ప్రదర్శించారు. ఇంకా ఏం చెప్పారంటే..


babu4 copy.jpgపదవి కోసం ఏ నేరమైనా చేస్తారు..

పదవి కోసం గొడ్డలి పార్టీ నాయకులు ఏదైనా చేస్తా రు.. ఏ నేరమైనా చేస్తారు. నేరాలు, ఘోరాలు చేయడం ఆ పార్టీకి అలవాటు. గతంలో వివేకానందరెడ్డిని చంపి నాపై నెట్టినట్లే.. ఇప్పుడు కూడా ఆ పార్టీ చేసిన హింసకు నన్ను బాధ్యుడిని చేస్తూ ‘బాబు రాసిన రక్తచరిత్ర’ అం టూ వాళ్ల పత్రికలో రాస్తున్నారు. గొడ్డలి పార్టీ అరాచకాల కు కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. రాయచోటికి అంతర్రాష్ట్ర ముఠాలను, క్రిమినల్స్‌ను గొడ్డలి పార్టీ తీసుకొచ్చింది. పుంగనూరు, దర్శి, ధర్మవరం, తిరుపతి, పులివెందులలో ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.

నా డిక్షనరీలో హింసకు తావులేదు

కార్లతో మనుషులను గుద్దించడం, తొక్కించడం వంటి అరాచకాలకు గొడ్డలి పార్టీ తెగబడుతూ.. నేరస్థులను తయారుచేసే ఫ్యాక్టరీలా మారింది. రప్పా రప్పా రాజకీయాలు చేస్తూ కరుడుగట్టిన నేరాలను ప్రోత్సహిస్తోంది. మంచి వారిని కూడా నేరస్థులుగా మార్చడం ఆ పార్టీకి అలవాటు. హింస అనేది నా డిక్షనరీలోనే లేదు. ఫ్యాక్షనిజం కారణంగా సీమ 70 ఏళ్లపాటు నష్టపోయింది. అభివృద్ధికి దూరంగా ఉంది. నక్సలిజాన్ని వదిలిపెట్టాలని.. జనజీవన స్రవంతిలో కలవాలని నాడు పిలుపిచ్చాం. సీతక్క(ప్రస్తుత తెలంగాణ మంత్రి) అదే విధంగా రాజకీయాల్లోకి వచ్చారు. నక్సలిజం కారణంగా చాలా మంది నాయకులను కోల్పోయాం. రాబోయే 20 ఏళ్లు రాష్ట్రానికి చాలా ముఖ్యం. హింసను అరికట్టి నేరస్థులను దూరంగా పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మంచి నేతలను ఎన్నుకుని మంచి ప్రభుత్వాలను కొనసాగించుకోవాలి.


నాడు అధికార దుర్వినియోగం.. నేడు దాడులు

గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ అడ్డగోలుగా ఏకగ్రీవాలు చేయించుకుంది. ‘2014లో ఎంపీటీసీ ఏకగ్రీవాలు కేవలం 2 శాతం. జడ్పీటీసీ ఏకగ్రీవాలు 0.09 శాతం.. వైసీపీ హయాంలో అధికార దుర్వినియోగంతో ఎంపీటీసీ స్థానా ల్లో 24 శాతం, జడ్పీటీసీ స్థానాల్లో 19 శాతం ఏకగ్రీవాలు చేసుకున్నారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను అనర్హులుగా చేయడానికి నాడు ఓ చట్టాన్ని తెచ్చారు. వారి ఇళ్లలో దొంగతనంగా మద్యం బాటిళ్లు పెట్టించి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. పులివెందుల వంటి చోట్ల నామినేషన్లే వేయనివ్వలేదు. ఈ అక్రమాలపై అప్పటి ఎస్‌ఈసీ(నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌) ప్రశ్నిస్తే ఆయన్నే తప్పుబట్టారు. చివరకు సదరు ఎస్‌ఈసీ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కేంద్రానికి లేఖ రాసే దుస్థితి తెచ్చా రు. అదే నేడు కూటమి పాలనలో కుప్పం, పిఠాపురం, పులివెందుల సహా అన్ని ప్రాంతాల్లో వైసీపీ, వివిధ పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. జగన్‌ హయాంలో ఇన్ని నామినేషన్లు పడిన దాఖాలు లేవు.

హామీలన్నీ నెరవేరుస్తూ..

2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్‌డీఏకి 94 శాతం స్ట్రయిక్‌ రేట్‌, 57 శాతం ఓట్‌ షేర్‌తో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ప్రధాని మోదీ, పవన్‌ కల్యాణ్‌, నేను కలిసి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందిస్తున్నాం. దేశంలోనే అత్యధిక సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’తోపాటు అన్నదాత సుఖీభవ, స్ర్తీశక్తి, దీపం-2.0 పథకాలను సమర్థంగా అమలు చేస్తు న్నాం. గత ప్రభుత్వంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో భూ దోపిడీ చేయాలని చూశారు. ప్రజల ఆస్తులపై నాటి సీఎం తన బొమ్మలు వేసుకున్నారు. మేమొచ్చి రాజముద్రతో పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. దేవుళ్లను, దేవాలయాలను నాటి పాలకులు అపవిత్రం చేసి ప్రసాదాలన్నీ కల్తీ పదార్థాలతో తయారు చేయిస్తే.. ప్రస్తుతం ఏ దేవాలయానికి వెళ్లినా పవిత్ర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టాం. 2029 నాటికి 36 ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తిచేస్తాం.


జెన్‌జీని పావులుగా వాడుకునే యత్నం

గొడ్డలి పార్టీ అధినేత జెన్‌జీ.. జెన్‌జీ అని కలవరిస్తున్నారని, జెన్‌జీ అంటే అవినీతిపరులను మోయడానికే ఉన్నట్లు ఆయన భావిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఏ విధంగా మేలు చేయాలనే ఆలోచన లేకుండా, వారిని పావులుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను చేసిన అవినీతి, అక్రమాల నుంచి రక్షణ పొందేందుకే ఆయన జెన్‌జీ అంటున్నారని విమర్శించారు. ‘ఆ పార్టీ చేసిన అకృత్యాల నుంచి జెన్‌జీ కాపాడాలా? క్రిమినల్స్‌తో కలిసి జెన్‌జీలు తమ జీవితాన్ని నాశనం చేసుకోవాలా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీశారు.

విద్యావంతులు వర్సెస్‌ గంజాయి బ్యాచ్‌

స్థానిక ఎన్నికల్లో పోటీ విద్యావంతులు వర్సెస్‌ గంజాయి బ్యాచ్‌ అన్నట్లుగా ఉంది. కూటమి పార్టీలది ప్రజాస్వామ్య అజెండా అయితే... గొడ్డలి పార్టీది హింసా విధానం. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందినా బుద్ధి తెచ్చుకోలేదు. స్థానిక ఎన్నికల్లోనూ వినాశనానికే ప్రాధాన్యం ఇస్తోంది. గొడ్డలి సంస్కృతి, హింస, నేరప్రవృత్తి వంటివి నాటికీ నేటికీ ఆ పార్టీ డీఎన్‌ఏలోనే ఉన్నాయి. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బెంగళూరు నుంచి వచ్చి.. 3 గంటల పాటు ప్రెస్‌ మీట్‌ పెట్టి.. ఎస్‌ఈసీ వద్దకు వెళ్లి సొంత చానళ్లలో లైవ్‌ పెట్టించుకుని తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఎక్కడ ఉంటాడో తెలియకుండా మాఫియాను నడిపించిన దావూద్‌ ఇబ్రహీం తరహా మనస్తత్వంతో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు. బెంగళూరులో ఉంటూ ఇక్కడ అరాచకాలు సృష్టిస్తూ, అప్పుడప్పుడు వచ్చి ప్రెస్‌ మీట్లు పెట్టి వెళ్తున్నారు. కొలంబియాలో డ్రగ్‌ లార్డ్‌ ఎస్కోబార్‌ ఆ దేశాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు గొడ్డలి పార్టీ అధినేత కూడా అదే తరహా మనస్తత్వంతో.. హింసను నమ్ముకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. రప్పారప్పా నరుకుతామనడం, పోస్టర్లకు రక్తాభిషేకాలు చేయడం హింసను ప్రోత్సహించడం కాదా..?

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: సత్యకుమార్‌

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

Updated Date - Oct 20 , 2026 | 06:23 AM