Share News

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:32 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది.

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు
sec anil

  • మతం, కులం, ప్రాంతం పేరుతో ఓట్లు అడగొద్దు

  • భవన యాజమానుల అనుమతి లేకుండా పార్టీ జెండాలు, పోస్టర్లు, రాతలు వద్దు

  • సభలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి

  • పోలింగ్‌కు ముందు ప్రచారం, మద్యం బంద్‌

  • రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళి జారీ

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుంది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వర్తిస్తుంది. వారితో పాటు రాజకీయ పార్టీలు, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, ఎన్నికలతో సంబంధం ఉన్న ఇతరులు ఈ నియమావళిని తప్పనిసరిగా పాటించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. నియమావళిలో ఎన్నికల ప్రచారం, సభలు, ఊరేగింపులు, పోలింగ్‌ రోజు వ్యవహారాలు, ప్రభుత్వ యంత్రాంగం వినియోగం, ఎన్నికల ఖర్చులపై పలు నిబంధనలు స్పష్టం చేశారు.

కులమతాల పేరుతో ప్రచారం వద్దు

ఎన్నికల్లో కులం, మతం, జాతి, ప్రాంతం ఆధారంగా ఓట్లు అడగరాదు. వివిధ వర్గాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడరాదు. దేవాలయాలు, మసీదులు, చర్చిల వంటి ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచార వేదికలుగా వినియోగించరాదు.

ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలకు సంబంధం లేని అంశాలపై ఆరోపణలు చేయడం, నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయడం నిషేధం.

అభ్యర్థుల ఇళ్ల వద్ద నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించరాదు. భవనాల యాజమానులు లేదా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా పార్టీ జెండాలు కట్టడం, పోస్టర్లు అతికించడం, నినాదాలు రాయడం చేయకూడదు.

ప్రత్యర్థులు నిర్వహించే ఎన్నికల సమావేశాలకు ఆటంకం కలిగించరాదు. ప్రత్యర్థి పార్టీ ఏర్పాటు చేసిన జెండాలు, పోస్టర్లను తొలగించడం లేదా ధ్వంసం చేయడం నిషేధం.


ఓటర్లను ప్రలోభపెట్టొద్దు

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, బహుమతులు లేదా ఇతర రకాల ప్రతిఫలాలు ఇవ్వకూడదు.

పోస్టర్లు, కరపత్రాలు, ప్రకటనలను ముద్రించేటప్పుడు ముద్రించిన వారు, ప్రచురణ కర్తల పేర్లు, చిరునామాలు తప్పనిసరిగా పేర్కొనాలి.

పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఓట్ల కోసం ప్రచారం చేయడం, ఓటర్లను అభ్యర్థించడం నిషేధం. పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లను తీసుకురావడానికి లేదా అక్కడి నుంచి తీసుకెళ్లడానికి వాహన సౌకర్యాలు కల్పించరాదు.

ప్రచారానికి అనుమతులు తప్పనిసరి

బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించాలంటే పూర్తి వివరాలతో సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. లౌడ్‌ స్పీకర్ల వినియోగానికి కూడా అనుమతి అవసరం. లౌడ్‌ స్పీకర్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలి. ఆసుపత్రుల పరిసరాల్లో శబ్ధ కాలుష్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

పోలింగ్‌కు ముందు ప్రచారానికి బ్రేక్‌

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి ముందు 24 గంటల నుంచి బహిరంగసభలు, ఊరేగింపులు నిర్వహించరాదు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసే సమయానికి ముందు 44 గంటల నుంచి నిషేధం అమల్లో ఉంటుంది.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో 48 గంటల ముందు నుంచి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 44 గంటల ముందు నుంచి పోలింగ్‌ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం సరఫరా నిలిపేయాలి.

కొత్త పథకాలు వద్దు

ప్రభుత్వం నిధులతో కొత్త పథకాలు, ప్రాజెక్టులు, ఆర్థిక గ్రాంట్లు, చెల్లింపులు ప్రకటించరాదు. శంకుస్థాపనలు నిర్వహించడం, రహదారులు, తాగునీటి సౌకర్యాల కల్పన వంటి హామీలు ఇవ్వడంపై ఆంక్షలుంటాయి.

ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, సహకార సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందే సంస్థలకు చెందిన వాహనాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించకూడదు.


ఖర్చుల లెక్కలు సమర్పించాలి

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల ఖర్చు చేయరాదు. రోజువారీ ఖర్చుల వివరాలను నిర్దేశించిన నమూనాలో నమోదు చేసుకోవాలి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా మొత్తం ఎన్నికల ఖర్చుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలి.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఐబీ సమీక్ష

నేడు స్విమ్స్‌ ఓపీ, ఓటీలకు సెలవు

Updated Date - Oct 20 , 2026 | 05:33 AM