చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 02 , 2026 | 07:02 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పల్నాడు జిల్లా, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (బుధవారం) నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నారా లోకేశ్ పాల్గొని టీడీపీ శ్రేణులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి..
ఈ సమావేశంలో నారా లోకేశ్ మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే ఆరోపణలు, వివాదాల విషయంలో పార్టీ శ్రేణులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా వైసీపీ నేతలు సొంతవాళ్లను హతమార్చి.. ఆ నిందలను టీడీపీపై మోపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
ధైర్యంగా చర్చకు రావాలి..
డీఎస్సీ అంశంపై కూడా నారా లోకేశ్ స్పందించారు. డీఎస్సీపై ఆరోపణలు చేసి పారిపోవడం కాదని, ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు, ఆధారాలు ఉంటే ధైర్యంగా చర్చకు రావాలని జగన్ అండ్ కోకు సవాల్ చేశారు. విద్యా రంగానికి సంబంధించిన అంశాలపై రాజకీయ విమర్శలు చేయడం కంటే వాస్తవాలను ప్రజల ముందుంచడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
కేడర్ సమన్వయంతో పనిచేయాలి..
రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత బలాన్ని మరింత పెంచాలని పార్టీ నాయకులకు లోకేశ్ సూచించారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మార్గ నిర్దేశం చేశారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భారీ మెజార్టీతో గెలిపించేలా ఎన్నికల వ్యూహాలను అమలు చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది..
అదేవిధంగా, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలపై నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్
ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News