పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:41 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా పయనిస్తోంది.
అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా పయనిస్తోంది. పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి కీలక మౌలిక వసతుల కోసం మొత్తం రూ.308.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ భారీ నిధులు, సమగ్ర ప్రణాళికలతో పిఠాపురాన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ మేరకు ఎక్స్(X)లో పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.
మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం..
పిఠాపురం ప్రజల చిరకాల కోరిక అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 120 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్‌లైన్లను నిర్మించనున్నారు. అలాగే, పట్టణంలోని ప్రధాన చెరుకుల కాలువకు ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పిఠాపురం పట్టణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దోమల నివారణకు తోడ్పడటంతోపాటు పట్టణ పరిశుభ్రత మెరుగుపడి, ప్రజారోగ్య పరిరక్షణలోనూ గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. పిఠాపురం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిష్ఠాత్మక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్‌కు రూ.200 కోట్ల నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి సహకరించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణకి.. పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీరు
పిఠాపురం పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 59.52 కోట్ల భారీ బడ్జెట్‌తో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అమృత్ 2.0లో భాగంగా రూ. 57.37 కోట్లు, టిడ్కో గృహ నిర్మాణ పథకం ఇళ్లకు నీటి సరఫరా కోసం రూ. 2.15 కోట్లను కేటాయించారు. పట్టణానికి మొత్తం 120.19 కిలోమీటర్ల పైప్‌లైన్ అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న 72.90 కిలోమీటర్ల లైన్‌లో 35 కిలోమీటర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీని కోసం కొత్తగా, అదనంగా 82.29 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులను ప్రతిపాదించారు. పట్టణంలో 600 లీటర్ల సామర్థ్యం గల భారీ ఎత్తైన నీటి నిల్వ ట్యాంకు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 400 లీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పట్టణ ప్రజల కోసం కొత్తగా దాదాపు 5 వేల తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. పిఠాపురం పట్టణానికి రోజువారీ నీటి కొరత లేకుండా ఏలేశ్వరం జలాశయం నుంచి రోజుకు 55 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు ఒక ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటు జరుగుతోంది. పిఠాపురం పట్టణ ప్రజల రోజువారీ నీటికి అవసరమైన 80 లక్షల లీటర్లను దృష్టిలో ఉంచుకుని, రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు..
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశ కింద పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ. 4 కోట్లతో తడి చెత్త నిర్వహణ కేంద్రం, రూ.1.43 కోట్లతో మల వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి. పట్టణంలోని 18,468 ఇళ్ల నుంచి ప్రతిరోజూ 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు వేగవంతం అవుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజుకు వచ్చే 25 టన్నుల చెత్తను పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణంలో గతంలో పేరుకుపోయిన భారీ మొత్తంలో ఘన వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్త సమస్య తగ్గడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్
రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News