Share News

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:00 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడంతో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. 2024లో కూటమి రాకతో గ్రహణం వీడిందని తెలిపారు.

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

మార్కాపురం జిల్లా, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రావడంతో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) విమర్శించారు. 2024లో కూటమి రాకతో గ్రహణం వీడిందని తెలిపారు. ఈరోజు (సోమవారం) మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. గొడ్డలి పార్టీ హయాంలో విలువైన ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణ కాలాన్ని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. నిర్వాసితుల కోసం జీవో ఇచ్చి అరకొర చెల్లింపులతో మోసం చేశారని ఆగ్రహించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల కంటే ఒక్క నెల ముందు ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నట్లుగా జగన్ డ్రామాలు ఆడారని మండిపడ్డారు.


సిగ్గులేని గొడ్డలి పార్టీని ఏమనాలి..

రూ.4 వేల కోట్ల పనులను పెండింగ్‌లో ఉంచుకుని ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసిన సిగ్గులేని గొడ్డలి పార్టీని ఏమనాలని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఫేక్ డ్రామాలు, సినిమా సెట్టింగులతో ప్రజలను, రైతులను మోసం చేసిన వ్యక్తులను ఏం చేయాలని ఫైర్ అయ్యారు. రెండు సొరంగాలు మొత్తం తిరిగానని చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు ఎందుకివ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. వారి హయాంలో సొరంగాల్లో టీబీఎం యంత్రం ఇరుక్కు పోయిందని.. సొరంగం పనులు పూర్తి కాలేదని చెప్పారు. ఈ సమస్యలను తాము పరిష్కరించి, వెలిగొండ పనులు పూర్తి చేసి ఇప్పుడు నీళ్లు ఇచ్చామని వెల్లడించారు. ఫేక్ మాటలు చెప్పే వ్యక్తులను, మోసం చేసిన వారిని గుర్తించి ఈ ప్రాంత ప్రజలు నిలదీయాలని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పనులు తామే పూర్తి చేశామని గొడ్డలి పార్టీ నేతలు ఇప్పుడు బుకాయిస్తున్నారని ధ్వజమెత్తారు. 11 ఏళ్ల పాటు వైఎస్సార్, జగన్ అధికారంలో ఉండి ఈ ప్రాజెక్ట్‌ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఇంకా రూ.1900 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని.. వీటిని పూర్తి చేస్తే మొత్తం వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


చరిత్రను ఎవరూ తిరగరాయలేరు..

చరిత్రను ఎవరూ తిరగరాయలేరని.. గొడ్డలి పార్టీ ఫేక్ ప్రచారాన్ని సమర్థంగా తాము తిప్పికొడతామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. చెడును ఖండించాలని.. మంచి చేసిన ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. నదుల అనుసంధానం ద్వారానే నీటి సమస్యను పరిష్కరించగలమని వ్యాఖ్యానించారు. దక్షిణ భారత్‌లో గోదావరి - కావేరి అనుసంధానం చేయాలని సూచించారు. మహానది- గంగానది కూడా అనుసంధానిస్తే దేశం సుభిక్షం అవుతుందని చెప్పుకొచ్చారు.


పోలవరాన్ని 2027 మార్చికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం..

పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని.. దీనిని 2027 మార్చికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. 2028లో కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. గోదావరి నీరు నల్లమల సాగర్ వరకూ రావాలని.. దానికి తాము అన్ని విధాలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఇరిగేషన్ క్యాలెండర్ కూడా ఇచ్చామని ప్రస్తావించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి తీసుకెళ్తున్నామని.. ఆ తదుపరి వంశధార వరకూ తీసుకెళ్తామని వెల్లడించారు.కరువును ఎదుర్కొవాలంటే ప్రతీ వర్షపు నీటి చుక్కనూ పొదుపు చేసి భూగర్భజలాలుగా మారుద్దామని పిలుపునిచ్చారు.


వెలిగొండ వెలుగులు నింపుతుంది..

ప్రజలు ఇచ్చిన తీర్పుతో వెలిగొండ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఈ ప్రాంతానికి జలసిరులను, మూడు జిల్లాల అభివృద్ధికి రెక్కలను తొడిగామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలిగొండ వెలుగులు నింపుతుందని ఉద్ఘాటించారు. మాట ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణమ్మను తరలించామని.. ఇక సంపద సృష్టిస్తామని వెల్లడించారు. ఈ మార్కాపురం గడ్డకు.. కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్‌ బాధలను భరించిన కుటుంబాలకు.. నీటి కోసం ఎదురు చూసి చూసి అలసిన తరాలకు... కృష్ణా జలాలతో కొత్త ఊపిరినిస్తున్నామని ఉద్ఘాటించారు. ఈ ప్రాజెక్ట్‌కు భూములు, ఇళ్లు, ఊళ్లు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రైతుల త్యాగం లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోందని చెప్పారు. ఈ ప్రాంత భవిష్యత్తుకు పునాది వేస్తుందని.. నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం పేర్కొన్నారు.


మాట ఇచ్చాం- మాట నిలబెట్టుకున్నాం..

‘చంద్రబాబు అనే నేను వెలిగొండ ప్రాజెక్ట్‌తో రైతుల కలలను నిజం చేశాను. వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చాను. మార్కాపురం జిల్లాను ఇచ్చాం. మాట ఇచ్చాం- మాట నిలబెట్టుకున్నాం. రాయలసీమ హార్టీకల్చర్ హబ్‌లో మార్కాపురాన్ని కూడా భాగం చేశాం. వెలిగొండ ఫేజ్- 2ను కూడా 2028కి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రతీ ప్రాంతం అభివృద్ధి ఎన్డీఏ విధానం. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు ఇలా అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి చేస్తాం. 2047 నాటికి పౌరులుగా మనం అంతా ఏం చేయాలో సంకల్పం చేయాలి. నేను ఓట్లు ఆశించి కాదు.. మార్పు ఆశించి పనిచేస్తున్నాను. ఇదే కూటమి సిద్ధాంతం. ఎన్నికల కోసం కాదు ప్రజల జీవితాలను మార్చేందుకు.. భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నాను’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ఖరారు.. షెడ్యూల్ ఇదే..

వైసీపీ హయాంలో శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారు: బొండా ఉమా

తిరుపతి నైలిట్ సంస్థ మూసివేతపై క్లారిటీ.. అసలు విషయమిదే

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 03:48 PM