Share News

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Sep 01 , 2026 | 08:43 PM

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలని ఆదేశించారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. 2027 సెప్టెంబర్‌కు వందశాతం అక్షరాస్యత లక్ష్యమని ఉద్ఘాటించారు. ఏడాదిలో 25 లక్షల మంది అక్షరాస్యులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఏపీని అభినందించిందని అన్నారు. రాష్ట్ర అక్షరాస్యత 72.6శాతం నుంచి 82.1శాతానికి పెరిగిందని అధికారులు వివరించారు. 2027 మార్చిలో మరో 25 లక్షలు.. సెప్టెంబర్‌కు మరో 27 లక్షల మందికి అక్షరాస్యత కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూళ్లలో చేర్చాలి..

11 ప్రభుత్వ శాఖల సమన్వయంతో అక్షరాస్యత ఉద్యమం కొనసాగుతోందని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. బడిబయట ఉన్న ప్రతి చిన్నారిని స్కూల్లో చేర్పించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీలో ఇంకా 1,64,821 మంది బడిబయట పిల్లలు ఉన్నారని.. వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ ఏడాది 33 వేల మంది బడిబయట పిల్లలను స్కూల్లో విద్యాశాఖ చేర్చిందని వివరించారు. లీప్ యాప్ ద్వారా మిగిలిన పిల్లల వివరాలు ప్రధానోపాధ్యాయులకు అందించాలని నిర్ణయించామని అన్నారు. ఉపాధ్యాయుల హాజరు 98.97శాతం.. విద్యార్థుల హాజరు 85.41శాతం ఉందని వివరించారు. మూడు రోజులు వరుసగా గైర్హాజరైతే తల్లిదండ్రులను పిలిచి అవగాహన కల్పించాలని సూచించారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు కూడా హాజరుపై బాధ్యతలు అప్పగించాలని లోకేశ్ నిర్దేశించారు. క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల విజయంపై ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.


ఏఐ సమర్థ్ ద్వారా టీచర్లకు ఏఐ టూల్స్‌లో ప్రత్యేక శిక్షణ..

ఏఐ సమర్థ్ ద్వారా టీచర్లకు ఏఐ టూల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. మిషన్ మార్చి-2026పై సమీక్షించి.. పదోతరగతిపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని తెలిపారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహణపై చర్చిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన విజయవాడలో 192 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై రాజీ లేదని స్పష్టం చేశారు. లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులు, టీచర్లు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటర్‌లో ఈ ఏడాది 10 వేల అడ్మిషన్లు పెరిగాయని వెల్లడించారు. తల్లికి వందనం కింద ఇంటర్ విద్యార్థులకు రూ.1,051 కోట్ల సాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్ విద్యార్థులకు వందశాతం APAR ID ఇంటిగ్రేషన్ పూర్తి చేయాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్

రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 09:07 PM