Share News

తీవ్ర వాయుగుండం.. 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:16 AM

ఏపీలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.

తీవ్ర వాయుగుండం.. 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
AP Minister BC Janardhan Reddy

అమరావతి, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): ఏపీలో తీవ్ర వాయుగుండం నేపథ్యంలో 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆర్ అండ్ బీ శాఖ అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister BC Janardhan Reddy) ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఈరోజు (గురువారం) ఉదయం 7 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 356 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. తీవ్ర వాయుగుండం కారణంగా శ్రీకాకుళం, పార్వతిపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 4 చోట్ల తీవ్ర గుంతలు ఏర్పడి రహదారులు కొట్టుకుపోయాయని పేర్కొన్నారు.


ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు..

78 చోట్ల సీడీ వర్క్స్ దెబ్బతినగా, 37 ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివరించారు. 11 చోట్ల రహదారులకు అడ్డంగా చెట్లు పడిపోయాయని తెలిపారు. ఈ చెట్లను పూర్తిగా తొలగించి ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా చేశామని అన్నారు. తీవ్ర వర్షం కారణంగా 23 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే, 14 చోట్ల ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేయగలిగామని చెప్పారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్ధరణకు దాదాపు రూ. 26.95 కోట్లను కేటాయించాలని అంచనా వేశామన్నారు. అలాగే, శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరణకు రూ. 224.73 కోట్లు అవసరమవుతుందని అంచనా వేశామని తెలిపారు.


614 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం..

మొత్తంగా తీవ్ర వాయుగుండం కారణంగా దెబ్బతిన్న ఆర్ అండ్ బీ శాఖ రహదారుల పునరుద్ధరణకు రూ. 251. 68 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి అన్నారు. ఏపీవ్యాప్తంగా 78 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, నోడల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ అనుబంధ విభాగాలతో 36 ఉమ్మడి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని చెప్పారు. ప్రధాన కార్పొరేషన్లలో టోల్ ఫ్రీ సేవలు ఏర్పాటు చేసి 24x7 నిరంతర సేవలందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సమస్యాత్మక/ ప్రమాదం పొంచి ఉన్న 614 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. రోడ్లపై విరిగిపడే చెట్లు మట్టి, కొండ చరియలు వంటి అడ్డంకులను తొలగించేందుకు 550 జేసీబీలు, 596 పవర్ రంపాలు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామాగ్రి సిద్ధంగా ఉంచామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ

తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 11:33 AM