స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ
ABN , Publish Date - Nov 26 , 2026 | 09:02 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 26 జిల్లాల్లోని 201 మండలాల్లో 3,191 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 25,061 వార్డు స్థానాలకు పోలింగ్ తదనంతర లెక్కింపు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 26 జిల్లాల్లోని 201 మండలాల్లో, 3,191 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 25,061 వార్డు స్థానాలకు పోలింగ్ తదనంతర లెక్కింపు ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 21 జిల్లాలో, 4 మున్సిపల్ కార్పొరేషన్లలోని 258 వార్డులకు, 19 పట్టణ స్థానిక సంస్థల్లో 711 వార్డులకు ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఈరోజు (గురువారం) అమరావతి వేదికగా డీజీపీ మీడియాతో మాట్లాడారు.
46,380 మంది పోలీస్ సిబ్బందితో విస్తృత బందోబస్తు..
ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని డీజీపీ చెప్పుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం 46,380 మంది పోలీస్ సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, సాంకేతిక పరిజ్ఞానం, అదనపు బలగాల మోహరింపుతో ఎన్నికల భద్రతను పటిష్ఠంగా పర్యవేక్షించామని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి పల్నాడు, సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి తదితర జిల్లాల్లో మొత్తంగా 44 ఘటనలు చోటుచేసుకున్నాయని ప్రస్తావించారు.
చట్టపరంగా కేసులు నమోదు చేశాం..
వీటికి సంబంధించి చట్టపరంగా కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించామని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య సురక్షితంగా తరలించామని చెప్పారు. ఎన్నికల అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News