Share News

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Nov 25 , 2026 | 10:00 PM

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలని ఆధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. బ్రేక్ వైర్ల దుర్వినియోగంపై మెకానిక్‌లకు అవగాహన కల్పించాలని సూచించారు.

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలని ఆధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. బ్రేక్ వైర్ల దుర్వినియోగంపై మెకానిక్‌లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అటవీ సంపదను, వన్యప్రాణులను పరిరక్షించడంలో నిరంతరం అప్రమత్తతతో విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని పవన్ కల్యాణ్ అభినందించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ సిబ్బంది చేపట్టిన ప్రత్యేక పెట్రోలింగ్‌లో 69 వేట ఉచ్చులను గుర్తించి తొలగించారు.


అధికారులకు ప్రశంసలు..

ఈరోజు (బుధవారం) మారేడుమిల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లోని కంపార్ట్‌మెంట్ నంబర్ 26/4లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించారు. వన్యప్రాణులను అక్రమంగా వేటాడేందుకు మూడు చక్రాల వాహనాల బ్రేక్ వైర్లతో ఏర్పాటు చేసిన 69 ఉచ్చులను గుర్తించి చర్యలు చేపట్టారు. వాటిని తొలగించి వన్యప్రాణులకు పొంచి ఉన్న ముప్పును నివారించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, యానిమల్ ట్రాకర్లు, బేస్ క్యాంప్ సిబ్బందిని డిప్యూటీ సీఎం ప్రశంసించారు.


అవగాహన కల్పించాలి..

అడవుల్లో నిరంతర గస్తీ, క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తత, సమష్టి కృషి వల్ల అనేక వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు తప్పిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అక్రమ వేట నిరోధానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. బ్రేక్ వైర్లతో ఉచ్చుల తయారీని నియంత్రించే చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ షాపుల యజమానులు, మోటార్ మెకానిక్‌లకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.


నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టాలి..

అడవుల్లో అమర్చే ప్రతి ఉచ్చు ఒక వన్యప్రాణి ప్రాణానికి ముప్పుగా మారుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. వాటిని గుర్తించి తొలగించడం ద్వారా జీవవైవిధ్య పరిరక్షణకు కీలకమైన సేవ చేసినట్లు అవుతుందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వేటగాళ్ల నుంచి వన్యప్రాణులను రక్షించేందుకు అటవీ ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రత్యేక పెట్రోలింగ్ వంటి చర్యలను మరింత పటిష్ఠం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణలో స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 10:07 PM