ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 08 , 2026 | 09:08 PM
జలధార - జలహారతి ఇక నిరంతర కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జలధార - జలహారతి ఇక నిరంతర కార్యక్రమమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. జలధార - జలహారతిపై సీఎం ఈరోజు (శనివారం) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ ఏడాది సాధారణం కంటే 39 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జూన్ నుంచి డిసెంబర్‌లో సాధారణ వర్షపాతం 867 మిల్లిమీటర్లుగా ఉందని వెల్లడించారు.
తాగునీటి నిల్వలు, సరఫరాపై పక్కా ప్రణాళిక రూపొందించాలి..
కాగా.. ప్రస్తుతం 525 మిల్లిమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆగస్టులో 56 శాతం లోటు వర్షపాతం ఉండే అవకాశం ఉందని తెలిపారు. రిజర్వాయర్ల నీటి నిల్వలపైనా ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం అభిప్రాయపడ్డారు. ఏపీలోని వివిధ బేసిన్లలో ప్రస్తుతం 563.05 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతేడాది ఇదే సమయానికి 825.67 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఆగస్టు నుంచి భూగర్భ జలమట్టాలు మరింత పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తాగునీటి నిల్వలు, సరఫరాపై పక్కా ప్రణాళిక రూపొందించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లలో తాగునీటిని నిల్వ చేయాలని సూచించారు.
నీటిని సమర్థంగా వినియోగించి రిజర్వాయర్లు నింపాలి..
నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీటి కేటాయింపులు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అందుబాటులోకి వచ్చిన నీటిని ఒడిసి పట్టుకోవాలని సూచించారు. ఆయా ప్రాజెక్టుల్లోకి వస్తున్న నీటిని సమర్థంగా వినియోగించి రిజర్వాయర్లు నింపాలని మార్గనిర్దేశం చేశారు. తాగునీటి వసతి లేని ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అవసరమైన ప్రాంతాలకు నీటి సరఫరా కోసం ట్యాంకర్లను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగులో ఉన్న పంటలను కాపాడాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యం మేరకు వినియోగించాలని మార్గనిర్దేశం చేశారు. తక్కువ నీటి వినియోగంతో సాగు చేసే పంటలను భవిష్యత్తులో ప్రోత్సహించాలని సూచించారు.
పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..
నీటి లభ్యత తగ్గినా పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నీటి పొదుపు, వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాభావంతో పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పశువులకు మేత, నీటి లభ్యతను ముందుగానే నిర్ధారించాలని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో గోకులాలను సిద్ధం చేయాలని సూచించారు. పశుసంపద రక్షణకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
నీటి వనరుల సంరక్షణ నిరంతరం కొనసాగాలి..
నీటి వనరుల సంరక్షణ నిరంతరం కొనసాగాలని సీఎం తెలిపారు. చాలాకాలంగా నీటి లభ్యత లేని చెరువులు, కాల్వలను గుర్తించి నీరు అందించాలని సూచించారు. అదనపు నీరు ఉన్న ప్రాంతాల నుంచి కొరత ఉన్న ప్రాంతాలకు మైక్రో బేసిన్ అనుసంధాన అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. జలధార - జలహారతి కింద 82,865 పనులు గుర్తించామని.. 79,826 పనులు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. జలధార - జలహారతి కింద రూ.3,409.35 కోట్ల పనులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. చెరువులు, ఫీడర్ ఛానళ్లు, ఫార్మ్ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం పనులు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే భవిష్యత్తు నీటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు
శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News