త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ: పల్లా శ్రీనివాసరావు
ABN , Publish Date - Sep 30 , 2026 | 11:31 AM
త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీలో సీఎం చంద్రబాబు, దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తిరుపతి, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): త్వరలో రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) ప్రకటించారు. ఏపీలో సీఎం చంద్రబాబు, దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. మోదీ సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ నాలుగు రాష్ట్రాల్లో బైక్ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) తిరుపతి అలిపిరి నుంచి సేవా సంకల్ప్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రను పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. మోదీ ప్రజా సేవకు 25 ఏళ్లు పూర్తికావడంతో ఈ యాత్రను చేపట్టారు. 25మంది తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ నేతలు బైక్ యాత్రలో పాల్గొంటున్నారు. 8రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీవారి ఆశీస్సులను కోరుకుని యాత్ర ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మీదుగా యాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు.
ప్రజాక్షేత్రంలో వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెబుతాం..
కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విదేశాల్లో ఫేక్ ఖాతాలు సృష్టించి తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. ప్రజాక్షేత్రంలో వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో భాగంగా గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యం ఉంటుందని మాటిచ్చారు. ఎన్డీఏ కోఆర్డినేషన్ కమిటీ సిఫార్సుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.
జగన్ హయాంలో చేసిన అప్పులు, అక్రమాలతో ఏపీకి తీవ్ర నష్టం
గెలుపే ధ్యేయంగా విస్తృత సర్వేల నిర్వహణ, కూటమి నాయకులందరి ఆమోదంతో ముందుకెళ్లే వ్యూహాన్ని రచిస్తున్నామని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ సముచిత స్థానం, గుర్తింపు ఉంటుందని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది భవిష్యత్తుకు భద్రత కల్పిస్తూ స్పష్టమైన సర్వీస్ రూల్స్ రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో కనీస రూల్స్ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో చేసిన అప్పులు, అక్రమాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం: సీఎం చంద్రబాబు
తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News