ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:11 AM
ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో మంగళవారం ‘మిషన్ కర్మయోగి’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలను మెరుగు పరచడమే లక్ష్యంగా ‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. నైపుణ్యం కలిగిన యువత మన దేశానికి బలమని తెలిపారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలన్నింటినీ తెలుగువాళ్లే లీడ్ చేస్తున్నారని వెల్లడించారు. ఉద్యోగులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ట్రైనింగ్ అవసరమని చెప్పుకొచ్చారు. విజయవాడలో ఈరోజు (మంగళవారం) ‘మిషన్ కర్మయోగి’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో ‘మిషన్ కర్మయోగి’ కార్యక్రమంపై ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
వచ్చే 20 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యం..
గతంలో తమ గ్రామానికి సరైన రోడ్డు, నీటి సదుపాయం ఉండేదికాదని సీఎం చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో 10 గ్రామాలకు ఒక ఫోన్ ఉండేని ప్రస్తావించారు. విద్యుత్ లేని గ్రామంలో జన్మించి విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చానని ఉద్ఘాటించారు. వచ్చే 20 ఏళ్లు భారత్‌కు చాలా ముఖ్యమని వివరించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అనేక మార్పులను చూశానని తెలిపారు. 45 ఏళ్లలో చైనా సూపర్ కంట్రీగా ఎదిగిందని అన్నారు. 1990 నాటికి భారత్, చైనా ఆర్థిక వ్యవస్థ దాదాపు సమానమని చెప్పారు. ప్రస్తుతం భారత్ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు ఎక్కువ అని వివరించారు. సరైన సమయంలో సరైన వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉన్నారని కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశంగా మారే సామర్థ్యం భారత్‌కు ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కాగా, ‘మిషన్ కర్మయోగి’ వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థల కెపాసిటి బిల్డింగ్, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్, ‘మిషన్ కర్మయోగి’ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ భాగస్వామ్యంలో ముసాయిదా రూపకల్పన చేశారు.
ఈ సదస్సులో వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వ శిక్షణ సంస్థలు కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా, ఆయా శాఖల పనితీరును మెరుగు పరిచేలా సన్నద్ధం అయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ‘మిషన్ కర్మయోగి’ కార్యక్రమం అనంతరం నెల్లూరు జిల్లా ఉదయగిరికి సీఎం చంద్రబాబు బయలు దేరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మ తిరిగే రిజల్ట్స్ వస్తాయి: దానం నాగేందర్
భాగ్యనగరంలో మైకుల మోతపై నటుడు అల్లు శిరీశ్ ఫిర్యాదు
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News