Share News

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

ABN , Publish Date - May 20 , 2026 | 08:02 PM

కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు ఆదేశించారు.

కువైట్‌లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు అండగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు
AP CM Chandra babu Naidu

తిరుపతి, మే 20 (ఆంధ్రజ్యోతి): కువైట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (AP CM Chandra babu Naidu) ఆదేశించారు. చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి చెందిన భాగ్యవతి ఉపాధి కోసం ఫిబ్రవరిలో కువైట్‌కు వెళ్లగా, అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఓ వీడియో విడుదల చేసింది. గృహ సహాయకురాలిగా పనిచేస్తున్న తనకు సంబంధిత ఏజెంట్లు సరైన ఉద్యోగ వీసా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నట్లు వీడియో ద్వారా తెలిపింది. స్వదేశానికి పంపాలంటే డబ్బులు చెల్లించాలని ఏజెంట్లు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది.


సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలి: సీఎం

ఈ ఘటనపై వచ్చిన మీడియా కథనాలకు ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. బాధితురాలిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఎం సూచనలతో వెంటనే స్పందించిన ఏపీ ఎన్‌ఆర్టీ (Andhra Pradesh Non Resident Telugu Society) అధికారులు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు ప్రారంభించారు. భాగ్యవతి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆమెను త్వరితగతిన స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనలో సంబంధిత ఏజెంట్ల పాత్రపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు.


న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలి..

అవసరమైతే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇక తిరుపతి జిల్లా యంత్రాంగం బాధితురాలి కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపుల్లో ఉంది. చంద్రగిరి పోలీసులు కూడా కుటుంబానికి భరోసా కల్పిస్తూ, భాగ్యవతి సురక్షితంగా తిరిగి వచ్చే వరకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన మరోసారి విదేశీ ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. విదేశాలకు వెళ్లే ముందు అధికారిక అనుమతులు, వీసా వివరాలు పూర్తిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం

స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 20 , 2026 | 08:08 PM