సిట్ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:18 PM
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.
అమరావతి, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశాలపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. NDDB నివేదికను సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశమని పేర్కొన్నారు. మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు నివాసంలో భేటీ అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
వైసీపీ హయాంలో హిందూ మతంపై దాడులు..
ఐదేళ్లు తామే అధికారంలో ఉంటామని.. రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. భగవంతుడిపైనా వైసీపీ పగబట్టిందని ధ్వజమెత్తారు. అందరం ఏడు కొండలు అంటామని.. వైసీపీ వాళ్లు రెండు కొండలు అంటారని అన్నారు. వైసీపీ హయాంలో హిందూ మతంపై చాలా దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే.. ఇవి పోతే ఇంకొకటి కొందామన్నారని చెప్పుకొచ్చారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివారు చేశారని చెప్పారన్నారు.
మతాల ప్రస్తావన లేదు..
నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘తప్పు చేసి క్షమాపణ అడగకుండా మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారు. శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారు. సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్‌చిట్ ఇవ్వలేదు. రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది. భగవంతుడితో పెట్టుకున్నవారు సర్వనాశనం అయిపోతారు తప్ప బతికున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలి. భగవంతుడికి మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టం. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరం. 2022లోనే కల్తీ నిర్ధారణ అయ్యింది. అయినా అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగట్టారు’ అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి..
కల్తీ లడ్డూ వ్యవహారంలో కళ్ల ముందు ఎన్నో వాస్తవాలు కనిపిస్తుంటే మాట్లాడకపోవటం సబబు కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘అన్ని నివేదికలు.. ప్రసాదంలో వాడిన పదార్థాల్లో నెయ్యి లేదని నిర్ధారించాయి. ఎన్డీడీబీ జంతుకొవ్వు అవశేషాలు నిర్ధారిస్తే, తమ వద్ద అలాంటి పరీక్ష చేసే సామర్థ్యం లేదని ఎన్డీఆర్ఐ చెప్పింది. ప్రతీమాట భక్తుల మనోభావాలు, సెంటిమెంటును దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం. దేవుడి విషయాన్ని రాజకీయం చేయకూడదనే నిష్ఠతో వ్యవహరిస్తూ వస్తున్నాం. ప్రజలకు వాస్తవాలు చెప్పకుంటే అది ఇంకా పెద్ద తప్పు అవుతుందనే నిజాలు బయటపెడుతున్నాం. వైసీపీ హయాంలో పెద్దఎత్తున దేవాలయాలపై దాడులు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు
Read Latest Telangana News And AP News And Telugu News