వణుకు పుట్టిస్తున్న పెద్ద పులి.. రాజమండ్రి సమీపంలో..
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:12 AM
రాజమండ్రి పరిసర గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ అక్కడి ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా.. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
రాజమండ్రి, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): రాజమండ్రి సమీప గ్రామాల్లో పెద్ద పులి హడలెత్తిస్తోంది. రోజుకో ప్రాంతం తిరుగుతూ స్థానికులను వణిికిస్తోంది. తాజాగా.. రాజనగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో తెల్లవారుజామున పెద్ద పులి ఆవుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పంతం సత్యనారాయణ అనే రైతుకు చెందిన ఆవుపై గురువారం తెల్లవారుజామున పెద్దపులి దాడి చేసింది. ఈ పులి.. నామవరం అక్కమ్మతల్లి కొండప్రాంతం నుంచి దిశ మార్చుకుని పుణ్యక్షేత్రం వైపు వచ్చింది. బుధవారం రాత్రి నామవరం వద్ద బైక్‌పై వెళ్తున్న వారికి కనిపించి, ఆ తర్వాత ఆయిల్ పామ్ తోటల్లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
జీ.ఎర్రంపాలెంలో..
ఈ రోజు ఆవు దూడలపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. ఈ ఘటనలో ఒక ఆవుతో పాటు మూడు ఆవు దూడలూ మృతిచెందాయి. జీ.ఎర్రంపాలెంలో ఆవు దూడలు మృతిచెందిన ప్రాంతం వద్ద పులి ఆచూకీ కోసం అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అటవీ సిబ్బంది సహా మత్తు వైద్యులు, పోలీసులు చేరుకున్నారు. ప్రత్యేక బృందం పులికి మత్తుమందు ఇచ్చేందుకు గన్‌లు సిద్ధం చేసుకున్నారు.
అధికారుల చర్యలు..
రాజమండ్రి సమీపంలోని పుణ్యక్షేత్రం గ్రామంలో పెద్ద పులి సంచారం భయందోళనలు సృష్టిస్తోంది. ఇప్పటికే పెద్ద పులిని బంధించేందుకు ఢిల్లీలోని నేషనల్ టైగర్ అథారిటీతో సహా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అటవీశాఖ అధికారులు అనుమతులు తీసుకున్నారు. పులిని బంధించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పెద్ద పులి సంచారం నేపథ్యంలో గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు.
గ్రామంలో భద్రతా ఏర్పాట్లు..
ప్రజలు రాత్రి బయటకు రాకూడదని అటవీశాఖ అధికారులు సూచించారు. పొలాలకు వెళ్లే సమయంలో ఒంటరిగా వెళ్లవద్దని తెలిపారు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు. అటవీశాఖ, స్థానిక పోలీసులు గస్తీ పెంచుతూ, గ్రామంలో భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్
ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు
Read Latest Telangana News And AP News And Telugu News