Share News

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:40 PM

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడే విధంగా తాను త్వరలో పార్టీ పెడుతున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి
Vijay Sai Reddy

అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడే విధంగా తాను త్వరలో పార్టీ పెడుతున్నానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) ప్రకటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. అనంతపురంలో విజయసాయిరెడ్డి ఈరోజు (శుక్రవారం) పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ కేంద్రంగా అభివృద్ధి ఏమి చేశారనే విషయంపై రెండు కుటుంబాలనే ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. రాయలసీమ నుంచి రెడ్లు మాత్రమే కాదని.. చాలా మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. విజయదశమి తర్వాత వచ్చే ఏకాదశిన తమ పార్టీ జెండా రెపరెపలాడుతుందని స్పష్టం చేశారు. ఆ రోజు పార్టీ ఆవిర్భావం ఉంటుందని తెలిపారు. త్వరలో తన కూతురు టీవీ ఛానల్ పెడుతున్నారని, ఆ ఛానల్‌కు తనకు సంబంధం లేదని వెల్లడించారు. ఆ ఛానల్ న్యూటరల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కనుమరుగయ్యే అవకాశం లేదని.. తమిళనాడు సీఎం విజయ్ టీవీకే పార్టీ తరహాలో ఇక్కడి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని పేర్కొన్నారు.


రాయలసీమపై ఆ రెండు కుటుంబాలకు ప్రేమ లేదు..

రాయలసీమపై ఆ రెండు కుటుంబాలకు ప్రేమ లేదని.. ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. వైసీపీ అధినేత జగన్ కోసం రక్తం చిందిస్తామని గ్రామ గ్రామాన చెబుతున్నారని… ఆ రెండు కుటుంబాల కోసం కాకుండా గ్రామాలు, రాష్ట్రం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీభాగ్ ఒడంబడిక ఏమయ్యిందో చంద్రబాబు, జగన్ సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. రాయలసీమలో ఉపాధి కరువై ఇక్కడి ప్రజలు వలసలు పోతున్నారని చెప్పుకొచ్చారు. కొత్త తరం రాజకీయాల్లోకి రావాలని కోరారు. రెండు కుటుంబాలు ఉన్నంత కాలం రాష్ట్రం బాగుపడదని తెలిపారు.


యువతను ముఖ్యమంత్రిని చేస్తా..

ప్రతి ఒక్కరి నెత్తిన రూ. 5 లక్షల అప్పు ఉందని.. పుట్టబోయే బిడ్డకు కూడా అప్పు ఉందని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. 15 ఏళ్లుగా ఆంధ్ర గంజాయి సాగులో ముందంజులో ఉందని అన్నారు. పోటీ తత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాను పెట్టబోయే పార్టీ ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తన పార్టీకి ఓటు వేస్తే సమాజానికి మంచి చేసే వారు ఎవరైనా యువతను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. తాను ఏపీకి దిశానిర్దేశం చేస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం..

‘విద్యా విధానంలో వివక్షత ఉందని… దీన్ని రూపుమాపేందుకు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తాం. ఉచితంగా విద్య అందిస్తాం. క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ టీచర్లను నియమించి విద్యావిదానంలో సమూల మార్పులు తీసుకువస్తాం. ఐదేళ్లకు 30 లక్షల ఉద్యోగాలు కల్పించేలా మా పార్టీ విద్యావిధానం ఉంటుంది. నిరుద్యోగులకు ఉత్తిత్తి హామీ ఇవ్వను. ఉద్యోగం వచ్చేంత వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.10 వేల అలవెన్స్ ఇస్తాను. అకౌంటెబిలిటీ ఉండేలా తగిన చట్టం చేస్తాం. గ్రామగ్రామాన గంజాయి సమస్య ఉందని.. కఠిన చట్టాలతో గంజాయి వ్యాపారాన్ని కట్టడి చేస్తాం. ఏపీపీఎస్సీ ద్వారా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఔట్ సోర్సింగ్ విధానం ఉండదు. ఏ ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటారు. డీఎస్సీ విధానం ఉండదు…ప్లే గ్రౌండ్ ఎంతో తెలియని వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రలోభపెట్టి మత మార్పిడి చేయడానికి నేను వ్యతిరేకం. ఎన్నికల్లో 66 శాతం యువతకు రిజర్వేషన్ ఉంటుంది. ప్రతి సామాజిక వర్గానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తాం’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీస్ శాఖలో పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 02:01 PM