Share News

KTR on Local Elections: స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం: కేటీఆర్

ABN , Publish Date - Sep 29 , 2025 | 02:19 PM

ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు.

KTR on Local Elections: స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం: కేటీఆర్
KTR on Local Body Elections

హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections)కు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వాతావరణం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని ఉద్ఘాటించారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు టీటీడీపీ నేత ప్రదీప్ చౌదరి. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు.


కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డుల (Congress Six Guarantees)తో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము 'బాకీ కార్డులను' తీసుకెళ్తున్నామని తెలిపారు. బాకీ కార్డుతో కాంగ్రెస్ ప్రతి వర్గానికి పడిన బాకీని ఇంటింటికీ వెళ్లి గుర్తు చేస్తామని వివరించారు. కాంగ్రెస్ 'బాకీ కార్డులు' ఇంటింటికీ తీసుకుపోతే.‌‌. అదే బీఆర్ఎస్‌కు బ్రహ్మాస్త్రమని నొక్కిచెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సిటీ రోడ్లను కూడా కనీసం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills Bye Election) ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపిస్తారన్న నమ్మకముందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎరువుల కోసం అన్నదాతలు లైన్లలో నిలబడి కొట్లాడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్.


మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ చేసిన మోసంపై కోపంగా ఉన్నారని తెలిపారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలాగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉన్న హైదరాబాద్ నగరాన్ని ఉద్ధరించే పరిస్థితి లేదు కానీ.. కొత్త నగరాన్ని కడతానని రేవంత్‌రెడ్డి ఫోజులు కొడుతున్నారని దెప్పిపొడిచారు. నగరంలో కనీసం మోరీలు శుభ్రపరిచే పరిస్థితి లేదని, వీధి దీపాలు వెలిగించే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమైన ముఖ్యమంత్రి.. మరో కొత్త నగరం కడతానని పోజులు కొడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు తెలుగువారు దేశంలో ఉన్నారని ఎన్టీఆర్ నిరూపిస్తే.. దేశంలో తెలంగాణ వారున్నారని కేసీఆర్ నిరూపించారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ.. స్పీకర్‌ నిర్ణయంపై ఉత్కంఠ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 29 , 2025 | 03:16 PM