KTR on E- Formula Case: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో లై డిటెక్టర్ పరీక్ష చేయండి..కేటీఆర్ సవాల్
ABN , Publish Date - Sep 09 , 2025 | 08:42 PM
మొన్నటి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేస్తే కేవలం రెండు రోజులు మాత్రమే పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి పారిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR)కి సంబంధించిన నందినగర్‌లోని నివాసానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఇవాళ(మంగళవారం) వెళ్లారు. ఈ క్రమంలో కేటీఆర్‌తో హరీష్‌రావు (Harish Rao) పలు కీలక అంశాలపై చర్చించారు. ఏసీబీ కేసు ఇష్యూపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ-కారు రేసు కేసులో (Formula E car Race Case) మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇతర అధికారులు బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావు, ఎఫ్‌ఈవోలను ప్రాసిక్యూట్ చేసేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. అయితే, ఈ విషయంపై కేటీఆర్ స్పందించారు. మళ్లీ చెబుతున్నా ఫార్ములా - ఈ కేసులో ఏమీ లేదని... అదో లొట్ట పీసు కేసు అంటూ విమర్శించారు. తాను ఇక్కడే ఉంటానని, ఎవరైనా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష చేసుకోవచ్చని సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో (BRS Govt) హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశానని ఉద్ఘాటించారు. రూ.46 కోట్లు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వమని తానే ఆదేశాలు ఇచ్చానని గుర్తుచేశారు. ఫార్ములా ఈ-కారు రేసు కేసు నిర్వాహకులకు రూ.46 కోట్లు చేరాయని తెలిపారు. రూపాయి కూడా ఎక్కడా తారుమారు కాలేదని స్పష్టం చేశారు. ప్రతి రూపాయికి లెక్క ఉంటే... అవినీతి ఎక్కడ..? , అవినీతి నిరోధకం ఎక్కడ..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాసిక్యూషన్ చేసినా, ఛార్జ్ షీట్లు వేసినా ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. తాము మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలపై పోరాడతామని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను ఇద్దరం లై డిటెక్టర్ పరీక్ష ఎదుర్కొందామని ఛాలెంజ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ (Congress) హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని విశ్వసించి నిరుద్యోగులు బీఆర్ఎస్‌ను ఓడించారని తెలిపారు. కాంగ్రెస్ గెలిస్తే తలరాతలు మారతాయన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతల మాటలను నిరుద్యోగులు నమ్మారని పేర్కొన్నారు. కాంగ్రెస్ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు శతాబ్దపు అతిపెద్ద మోసమని విమర్శించారు. గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిందని సమాచారం వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని పరీక్ష రద్దు చేశారని గుర్తుచేశారు. అవకతవకలు జరిగాయని యువత మొత్తుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.
ఏపీపీఎస్సీలో అమ్ముకున్నట్లే ఇప్పుడు కూడా పోస్టులు అమ్ముకున్నట్లు ఉందని.. అందరినీ కలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అభ్యర్థులకు అన్యాయం చేయొద్దని, రాజకీయ కోణంలో చూడవద్దని కోరుతున్నామని పేర్కొన్నారు. రీవ్యాల్యుయేషన్‌తో ఫలితం లేదని... గ్రూప్ వన్ పరీక్షను (Group One Exam) మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తప్పు ఎక్కడ జరిగిందో నిజం నిగ్గు తేలాలని అన్నారు. జ్యుడీషియల్ కమిషన్ వేసి విచారణ చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందా... ఎవరి ప్రమేయం ఉందో తేలాలని పేర్కొన్నారు. దోషులు ఎవరో తేలాల్సిందేనని పట్టుబట్టారు మాజీ మంత్రి కేటీఆర్.
భేషజాలకు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) వ్యవహారించాలని కోరారు. ఉద్యోగాల విషయంలో మంత్రులు తలోమాట ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. ఇచ్చిన ఉద్యోగాలకే మళ్లీ నియామక పత్రాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేస్తే కేవలం రెండు రోజులు మాత్రమే పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని... కానీ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), రాహుల్ గాంధీకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆక్షేపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని... 6000 ఉద్యోగాలకు మించి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మాట ఇచ్చి... ఆ తర్వాత మొఖం చాటేయడం రాజకీయం కాదని విమర్శించారు. గ్రూప్ వన్ విషయంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సూచించారు. విద్యార్థులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..ఎందుకంటే..
For More Telangana News and Telugu News..