KTR Fires on CM Revanth: పాలమూరుకు ఏం చేశారు.. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:45 PM
పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుట్రతోనే పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
మహబూబ్‌నగర్ జిల్లా, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాలమూరుకు ఏం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు వెనుకబాటుకు మూమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ పార్టీలే కారణమని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి 21 నెలల్లో ఎక్కడ మాట్లాడినా.. తాను పాలమూరు బిడ్డను, నల్లమల బిడ్డనని చెప్పుకుంటారని... అభివృద్ధిలో పాలమూరు వెనుకబాటుకు గురైతే కనిపించడం లేదా? అని నిలదీశారు.
ఇవాళ(మంగళవారం) మహబూబ్‌నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే తమ బతుకులు మారుతాయని కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్ జిల్లాలో 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని.. ఇప్పటికైనా పాలమూరు అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేయాలని హితవుపలికారు. కేసీఆర్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని 90 శాతం పూర్తి చేశామని గుర్తు చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
తెరమీదకు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Rangareddy project) 10 శాతం పనులను కూడా రేవంత్‌రెడ్డి ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్(KCR)కు పేరు వస్తుందనే కుట్రతోనే పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని ఆరోపించారు. హడావుడిగా రూ.4000 కోట్లతో కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని సీఎం రేవంత్ తెరమీదకు ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. మనసులో ఏదో ఆలోచన పెట్టుకుని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి ఎన్‌జీటీ కూడా అడ్డుపడిందని.. రైతులు కూడా పరిహారం కోసం రోడ్డు ఎక్కుతున్నారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ నేతల అసత్యాలను తిప్పికొడతాం..
జిల్లాలో ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ నేతల అసత్యాలను తిప్పికొడతామని హెచ్చరించారు కేటీఆర్. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పది మంది ఎమ్మెల్యేలు వచ్చారని క్లియర్‌గా చెప్పారని గుర్తుచేశారు. మహేష్ కుమార్ గౌడ్ చెప్పిన మాటలను కోర్టు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉంటే ఎందుకు తమ పార్టీ నేతలతో కలవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని కాంగ్రెస్ మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తిడుతుంటే కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కేడర్‌ను సమాయత్తం చేస్తాం..
పైసా పని చేయకుండా అదే పాలమూరు ప్రాజెక్టుకు రేవంత్‌రెడ్డి తన మామ జైపాల్ రెడ్డి పేరు పెట్టుకున్నారని పేర్కొన్నారు. అయినా పాలమూరు ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleshwaram Project) రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే అయిందని.. అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఎలా అంటారని ప్రశ్నించారు. తమ నేతలను మహబూబ్‌నగర్ జిల్లాలో సమాయత్తం చేస్తామని ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
High Court Hearing on KTR Petition: కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టుపై కవిత సంచలన కామెంట్స్..
For More Telangana News and Telugu News..