Share News

Group 1 Exam Results Cancel: గ్రూప్ 1 పరీక్ష ఫలితాల రద్దు.. హరీష్ రావు ఘాటు రియాక్షన్..

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:39 PM

గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి..

Group 1 Exam Results Cancel: గ్రూప్ 1 పరీక్ష ఫలితాల రద్దు.. హరీష్ రావు ఘాటు రియాక్షన్..
Harish Rao

హైదరాబాద్, సెప్టెంబర్ 9: గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని.. కోర్టు తీర్పుపై సీఎం చెప్పే సమాధానం ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన హరీష్ రావు.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


‘గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనంలో అవకతవకలు.. పరీక్ష కేంద్రాల కేటాయింపు, హల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి.. ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ నీ నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదు. పరీక్షలు నిర్వహించడం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు చేయడం కాదు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కండ్లు తెరువు. నీ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి సిగ్గుతో తలదించుకో. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పు.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో హరీష్ రావు పోస్ట్ చేశారు.


ఇదిలాఉంటే.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్ 1 మెయిన్స్ మెరిట్ లిస్ట్‌ను ర్దదు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. మెయిన్స్ పేపర్స్‌ని తిరిగి మూల్యాంకనం చేయాలని.. ఆ తరువాతే తిరిగి మెయిన్స్ ఫలితాలను విడుదల చేయాలని స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్‌కు 8 నెలల సమయం ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం.. ఒకవేళ మూల్యాంకనం సాధ్యం అవకపోతే మళ్లీ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది.


Also Read:

చిరుత vs అడవి పంది: షాకింగ్ వీడియో..

ఓటింగ్‌ను బాయ్‌కాట్ చేసిన పార్టీలు

నేపాల్లో రాజకీయ గందరగోళం..ప్రధాని జంప్?

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 09 , 2025 | 12:43 PM