Share News

Harish Rao On Revanth Govt: రేవంత్ హయాంలో గన్ కల్చర్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 17 , 2025 | 06:19 PM

రేవంత్‌రెడ్డి హయాంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆక్షేపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో‌ ఇంత జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందని హరీశ్‌రావు ప్రశ్నల వర్షం కురిపించారు.

Harish Rao On Revanth Govt: రేవంత్ హయాంలో గన్ కల్చర్.. హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్
Harish Rao Criticisms On Revanth Reddy Government

హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రేవంత్ రెడ్డి (Revanth Reddy) హయాంలో తెలంగాణకు గన్ కల్చర్ వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. మంత్రి కుటుంబ సభ్యుల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే తుపాకీ పంపించారని, తమ్ముళ్ల కోసం ఫైల్స్ ఆపుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరిగా తయారైందని ఎద్దేవా చేశారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.


కేంద్ర ప్రభుత్వం స్పందించాలి..

వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టే సంస్కృతిని రేవంత్ హయాంలో తీసుకొచ్చారని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకుంటే కాంగ్రెస్, బీజేపీ మధ్య అక్రమ‌ సంబంధం ఉందని భావించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో‌ ఇంత జరుగుతుంటే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు నోరు మెదపటం లేదు..? అని నిలదీశారు. మంత్రుల పంచాయితీలు పరిష్కరించడానికే కేబినెట్ సమావేశాలు పెడుతున్నారని సెటైర్లు గుప్పించారు మాజీ మంత్రి హరీశ్‌రావు.


రేవంత్ కేబినెట్ ఆరడజను వర్గాలు..

కేబినెట్ భేటీలో మంత్రులు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్ ఆరడజను వర్గాలుగా విడిపోయిందని దెప్పిపొడిచారు. రాష్ట్ర ప్రభుత్వం అతుకుల బొంతలాగా మారిందని స్వయానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి హయాంలోని 23 నెలల్లో ఏం సాధించారని విజయోత్సవాలు జరుపుతారు..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా.. కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నీళ్లు, నిధుల వాటాలు సాధించామని ఉద్ఘాటించారు మాజీ మంత్రి హరీశ్‌రావు.


అవినీతి వాటాల కోసం కొట్లాట..

రేవంత్‌రెడ్డి హయాంలో మాత్రం అవినీతి వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పారిశ్రామికవేత్తలు, సినిమా ఇండస్ట్రీ, కాంట్రాక్టర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించి లొంగదీసుకుంటున్నారని ఆరోపించారు. హ్యామ్ మోడల్‌పై బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరుపుతామని హెచ్చరించారు. హ్యామ్ మోడల్ బోగస్ అని.. కమీషన్లు దండుకోవటానికే ఈ మోడల్ తీసుకువస్తున్నారని ఆరోపించారు. దీపావళికైనా హామీలు అమలు చేస్తారని ఎదురుచూసిన ప్రజలకు మళ్లీ నిరాళే ఎదురైందని మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బీసీ బంద్‌కు కవిత మద్దతు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 17 , 2025 | 07:47 PM