Congress On BC Bandh: బీసీ బంద్‌కి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:51 PM
బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు17 (ఆంధ్రజ్యోతి): బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రేపు (అక్టోబర్ 18)వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు (BC Reservations) ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు మహేష్ కుమార్ గౌడ్.
తాను కూడా బంద్‌లో పాల్గొంటానని ఉద్ఘాటించారు. ఈ బంద్‌లో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని ఉద్ఘాటించారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నతంగా ఆలోచించి ఈ బంద్‌లో పాల్గొంటున్నామని వివరించారు. బీజేపీ నేతలు ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేరని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఈ బంద్‌లో పాల్గొనాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
బీసీ బంద్‌ని జయప్రదం చేయాలి: ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) స్పష్టం చేశారు. రేపటి బీసీ బంద్‌ని జయప్రదం చేయాలని సూచించారు. రేపటి బీసీ బంద్‌కి అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని ఉద్ఘాటించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జనగణనలో భాగంగా కులగణన జరగాలని కోరారని పేర్కొన్నారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.
కాంగ్రెస్ డెడికేషన్ కమిషన్ పెట్టి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలని ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ కలిసి బీసీ బంద్‌కి మద్దతు కోరారని గుర్తుచేశారు. ఆర్. కృష్ణయ్యపై గురుత్వర బాధ్యత ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్. కృష్ణయ్య తెలంగాణలో చేసే ప్రయత్నం ఢిల్లీలో కూడా చేయాలని కోరారు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి.
బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లని ఆర్. కృష్ణయ్య ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించాలని సూచించారు. తాము కూడా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారితో కలిసి ఢిల్లీకి వచ్చి ప్రధాని మోదీని, రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. కాంగ్రెస్ బీసీ కులగణన చేసి, 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. బీసీలకు న్యాయం చేసి బీజేపీ క్రెడిట్ తీసుకున్న తమకు నష్టం లేదని చెప్పుకొచ్చారు. కేబినెట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలిపి గవర్నర్‌కి పంపించామని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో నియంత పాలన ఉండదు..
మంత్రి కొండా సురేఖ అంశంపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్ చర్చిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో స్వాతంత్రం ఉంటుందని ఉద్ఘాటించారు. అప్పుడప్పుడూ సమస్యలు వస్తాయని.. అవి సద్దుమనుగుతాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో నియంత పాలన ఉండదని.. సమస్యలన్నీ సద్దుమనుగుతాయని తెలిపారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలేనని, టీ కప్పులో తుఫాన్ లాంటివేనని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి
Read Latest Telangana News And Telugu News