Hyderabad Cyber Fraud: ‘ మీ అబ్బాయికి ప్రమాదం జరిగింది’.. రూ.35.23 లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:49 PM
చదువుకున్న వాళ్లు, వృద్ధులు, మహిళలు, యువకులు ఇలా అన్ని వర్గాల వారిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. 'మీ కొడుక్కి ప్రమాదం జరిగిందంటూ' తాజాగా ఓ మహిళ నుంచి లక్షల్లో డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు.
కష్టపడి సంపాదించడం చేతగానీ కొందరు ఇతరుల సంపదను దోచుకుంటారు. గతంలో ఇళ్లల్లో, బ్యాంకుల్లో, షాపుల్లోకి వెళ్లి.. విలువైన వస్తువులను చోరీ చేసేవారు. అయితే నేటికాలంలో దొంగతనాల తీరు మారింది. డిజిటల్ యుగం కావడంతో దొంగలు.. సైబర్ కేటుగాళ్ల అవతారం ఎత్తారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మన అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. చదువుకున్న వాళ్లు, వృద్ధులు, మహిళలు, యువకులు ఇలా అన్ని వర్గాల వారిని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. 'మీ కొడుక్కి ప్రమాదం జరిగిందంటూ' తాజాగా ఓ మహిళ నుంచి లక్షల్లో డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ (Hyderabad)నగరంలో 61 ఏళ్ల వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె కొడుకు లండన్ నగరంలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా స్టీవ్ అనే వ్యక్తి ఆ పెద్దావిడకు వాట్సాప్ కాల్ చేశాడు. తాను లండన్ లో వైద్యుడిగా పని చేస్తున్నాను అంటూ పరిచయం చేసుకున్నాడు. లండన్ విమానాశ్రయంలో ఆమె కుమారుడికి ప్రమాదం( Son Accident WhatsApp Scam) జరిగిందని, తలకు బలమైన గాయమైందని సైబర్ నేరగాళ్లు చెప్పారు. అంతేకాక లగేజ్ మిస్ అవ్వడంతో ఎలాంటి ఐడెంటిటీ లేదని, ఆసుపత్రిలో వైద్యులు చేర్చుకోవట్లేదని చెప్పిన నేరగాళ్లు ఆమెను భయపెట్టారు. దీంతో ఎలాగైనా తన కుమారుడికి చికిత్స అందించాలని విడతల వారీగా రూ. 35.23లక్షలు వృద్ధురాలు(Elderly Woman Scammed) ఆ కేటుగాళ్లకు పంపింది. తన కొడుకు ఎలా ఉన్నాడో చూసేందుకు ఫొటో, వీడియో పంపించాలని కోరగా.. కాల్ చేసిన వ్యక్తి అందుకు ఒప్పుకోలేదు. అనుమానం వచ్చిన బాధితురాలు కుమారుడి నెంబర్ కు కాల్ చేసింది. తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం