Share News

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..

ABN , Publish Date - Sep 02 , 2025 | 06:04 PM

బీహార్‌లో ఇటీవల రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’లో కొందరు మరణించిన ప్రధాని తల్లిపై అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయమై పీఎం మోదీ తాజాగా స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

PM Modi: ఎప్పుడో మరణించిన మా అమ్మపై దుర్భాషలా? అవమానకర వ్యాఖ్యలపై మోదీ భావోద్వేగం..
PM Modi Hits Back at Congress RJD about Abusing his Mother

బీహార్‌లో ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆధ్వర్యంలో జరిగిన ‘ఓటర్‌ అధికార్‌ యాత్ర’లో కొంతమంది ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తల్లిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మాట్లాడుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. చనిపోయిన తన తల్లిని కాంగ్రెస్-ఆర్జేడీ ఈ విధంగా దూషిస్తారని ఊహించలేదని అన్నారు. ఈ అవమానం తన తల్లికి మాత్రమే కాదు. బీహార్ తల్లులు, కుమార్తెలకు కూడా అవమానమని వ్యాఖ్యానించారు. మంగళవారం బీహార్ రాజ్య జీవిక నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.


బిహార్‌ రాజ్య జీవికనిధి శాఖ సహాయ సంఘ్‌ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ సుమారు 20 లక్షల మంది మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్నాళ్ల క్రితం బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ రాజకీయ కార్యక్రమంలో కొందరు నేతలు తన తల్లి హీరాబెన్‌ను అవమానకరంగా దూషించారని ప్రస్తావించారు. రాజకీయ వేదికలపై చనిపోయిన తన తల్లిని లాగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.


'అమ్మే మన ప్రపంచం. అమ్మే మన ఆత్మగౌరవం. బీహార్‌లో ఆర్జేడీ-కాంగ్రెస్ నా తల్లిని అవమానించారు. అమ్మ అనారోగ్యంతో ఉన్నా.. అత్యంత పేదరికంలోనే మమ్మల్ని అందరినీ కష్టపడి పెంచింది. ఎప్పుడూ తనకోసం కొత్త చీర కొనుక్కోలేదు. మా కుటుంబం కోసం ప్రతి పైసాను పొదుపు చేసేది. నా తల్లిలాగే, నా దేశంలోని కోట్లాది మంది తల్లులు ప్రతిరోజూ 'తపస్సు' చేస్తారు.ఇప్పుడు నా తల్లి జీవించి లేదని మీ అందరికీ తెలుసు. కొంతకాలం క్రితం, 100 సంవత్సరాలు నిండాక ఆమె మనందరినీ విడిచిపెట్టి వెళ్లిపోయింది. రాజకీయాలతో నా తల్లిని ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు అవమానించారు.ఇది నా తల్లికి మాత్రమే అవమానం మాత్రమే కాదు. దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు అవమానమే. నా హృదయంలో నాకు ఎంత బాధ ఉందో నాకు తెలుసు' అని ప్రధానమంత్రి అన్నారు.


ఈ సందర్భంగా మోదీ పరోక్షంగా రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లను ఉద్దేశిస్తూ,'పేద తల్లి కుమారుడి బాధలు, పోరాటాన్ని రాజ కుటుంబాల్లో పుట్టిన వారు అర్థం చేసుకోలేరు.గోల్డెన్ స్పూన్‌తో జన్మించిన వారు అధికారం కుటుంబ వారసత్వంగా భావిస్తారు. కానీ బీహార్ ప్రజలు మాత్రం నన్ను ఆశీర్వదించి ప్రధానిగా మార్చారు. ఇది విషయం కొంతమంది జీర్ణించుకోలేరు' అంటూ విమర్శించారు. తన తల్లి మరణించిన తరువాత కూడా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు రావడం బాధాకరమని మోదీ తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, వ్యక్తిగత దూషణలు సాంప్రదాయాలకు, భారతీయ సంస్కృతికి అనర్హమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన బీహార్ సభలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు బీజేపీ ఆరోపించింది.ఈ ఘటనపై పాట్నా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా స్పందించారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులపై కాల్పులు.. రేప్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పరార్..

సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. బీజేపీది రాజకీయ యాత్ర

For More National News

Updated Date - Sep 02 , 2025 | 06:53 PM