Pulivendula ZPTC BY Election: బరిలో 22 మంది
ABN , Publish Date - Aug 06 , 2025 | 09:11 AM
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
» పులివెందులకు 11 ఒంటిమిట్టకు 11 మంది పోటీ
» పులివెందులపైనే అందరి ఫోకస్
» పోటాపోటీగా ప్రచారాలు
» ప్రశాంత ఎన్నికల కోసం కలెక్టర్, ఎస్పీ గురి
» డ్రోన్ కెమెరాలతో నిఘా
(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల (Pulivendula, Ontimitta ZPTC BY Election) బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. మరో 8 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు.
ఇక ఒంటిమిట్ట నుంచి టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నుంచి పూల విజయభాస్కర్, మరో 8 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో రెండు స్థానాలకు కలిపి 22 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. మంగళవారం పులివెందుల, ఒంటిమిట్లలో టీడీపీ, వైసీపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.
అందరి దృష్టి పులివెందుల పైనే
పులివెందుల ఉప ఎన్నికపైనే అందరి దృష్టి ఉంది. సోషల్ మీడియాలో కూడా పులివెందుల ఎన్నికపై ఆరా తీస్తున్నారు. జగన్ సొంత గడ్డ కావడంతో, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి బరిలో ఉండటంతో ఈ స్థానానికి ప్రాధాన్యం పెరిగింది. ఎలాగైనా దీనిని గెలుచుకోవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. మంగళవారం కూటమి ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, మాధవి, పుత్తా చైతన్యరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, జమ్మలమడుగు ఇన్‌చార్జి భూపేశ్ రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ఇక వైసీపీ కూడా అవినాశ్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి కోసం ప్రచారం చేస్తున్నారు. గతంలో పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎదిరించి నామినేషన్ వేసేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. జగన్ హయాంలో ఇతరులు నామినేషనేషన్ వేయలేని పరిస్థితి ఉండేది. అయితే కూటమి ప్రభుత్వంలో వైసీపీతో పాటు ఇతరులూ స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. టీడీపీలోకి వలసలు వస్తుండడంతో సహజంగానే వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తుండగా.. టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో ఇక్కడ ఎన్నిక ఉద్రిక్తత కలిగిస్తోంది.
ఒంటిమిట్టలో..
ఇక ఒంటిమిట్లలో టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దుక్రిష్ణారెడ్డిని ఖరారు చేశారు. వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ టికెట్ కోసం పలువురు పోటీ పడ్డారు. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు, పుంగనూరు ఇన్‌చార్జి చల్లాబాబు, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్ మంగళవారం మంటపం పల్లెలో ప్రచారం నిర్వహించారు. పలు కుటుంబాలను వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్నారు.
కలెక్టర్ సమీక్ష
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జేసీ అదితిసింగ్, ఎస్సీ అశోక్ కుమార్, జడ్పీ సీఈవో ఓబులమ్మతో కలసి ఆర్వోలు, వీఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్, మొబైల్ కనెక్టివిటీ, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, మ్యాన్ పవర్, ట్రైనింగ్, సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, తదితర అంశాలపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు.
డ్రోన్లతో నిఘా
ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రచారం సందర్భంగా ఎలాంటి గొడవ జరగకుండా ఉండేందుకు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. పులివెందులలోని కనంపల్లె, నల్లపురెడ్డిపల్లె, ఆరుమ్మపల్లెలో పోలీస్ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఒంటిమిట్ట మండలంలో సమస్వాత్మక గ్రామాలైన చింతంరాజుపల్లె, జాండ్లపల్లె, బోయపల్లె గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్‌తో పాటు కార్డన్ సెర్చ్ చేశారు. డ్రోన్లతో నిమా ఉంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అక్కాతమ్ముళ్లను కలిపిన ఆంధ్రజ్యోతి
25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
For More AP News and Telugu News