Share News

Vijayawada Durga Temple:రూ.500 దర్శనం రద్దు చేద్దామా?

ABN , Publish Date - Aug 06 , 2025 | 08:18 AM

గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు.

Vijayawada Durga Temple:రూ.500 దర్శనం రద్దు చేద్దామా?
Vijayawada Durga Temple

» దసరా ఉత్సవాల్లో ఇబ్బందులు లేకుండా చూసే యోచన

» రూ.500 టికెట్ దర్శనం రద్దుచేసే దిశగా ఆలోచనలు

» ఏటా ఉత్సవాల్లో భక్తుల నుంచి వస్తున్న వ్యతిరేకతే కారణం

» ఉచిత, రూ.100, రూ.300 దర్శనాల్లో త్వరగా దుర్గమ్మ దర్శనం

» రూ.500 లైన్ మాత్రం గంటల తరబడి కదలని వైనం

» సహనం నశిస్తున్న భక్తులు.. అధికారులపై నినాదాలు

» ఈ ఉత్సవాల్లో ఆ పరిస్థితి లేకుండా చూడాలనే యోచనలు

» మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. రూ.500 టికెట్ తీసుకుంటే అమ్మవారి దర్శనం త్వరగా అవుతుందని చెప్పారు. ఇప్పటికీ క్యూలోకి వచ్చి మూడు గంటలు అవుతుంది. మాకు దుర్గమ్మ దర్శనం కాలేదు. ఇతర క్యూల్లో వచ్చిన భక్తులు దర్శనం చేసుకుని వెళ్లిపోతున్నారు. గత శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై భక్తులు వ్యక్తం చేసిన ఆగరహం ఇది.

» 'ఈవో డౌన్ డౌన్ ..' అంటూ భక్తుల నినాదాలు, 2023 శరన్నవరాత్రుల్లో రూ.500 క్యూలో భక్తులు చేసిన నిరసన ఇది.

» గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఏటా దసరా ఉత్సవాల్లో వస్తున్న ఇబ్బందులను గమనంలో పెట్టుకుని ఈసారి వేడుకల్లో రూ.500 టికెట్ దర్శనం రద్దు చేసే ఆలోచనలను అధికారులు చేస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి-విజయవాడ): గత రెండు మూడేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో (Vijayawada Durga Temple) రూ.500 దర్శనాలను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్న యోచనలో అధికారులు ఉన్నట్లు తెలిసింది. శరన్నవరాత్రుల్లో అంతరాలయం దర్శనం ఉండదు. కాబట్టి ఈ క్యూకు ఉత్సవాలు ముగిసే వరకు ఫుల్‌స్టాప్ పెడితే ఎలా ఉంటుందా.. అని ఆలోచన చేస్తున్నారు. దీనిపై మరింత కసరత్తు చేశాక తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు బావిస్తున్నారు.


రూ.500 దర్శనం లైన్‌లో అవస్థలు

ఏటా శరన్నవరాత్రుల్లో ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో ఉచిత దర్శనం చేసుకునే భక్తుల కోసం రెండు క్యూలైన్లు ఉంటాయి. ఈ రెండూ వినాయకుడి ఆలయం నుంచి మొదలై ఘాట్ రోడ్డు మీదకు వస్తాయి. రూ. 100, 300, 500 క్యూలను ఏర్పాటు చేస్తారు. రూ.500 క్యూలైన్ ఓ మలుపు వద్ద నుంచి ప్రారంభమవుతుంది. ఈ టికెట్ కొన్న భక్తులు ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఐదే క్యూలైన్‌కు అనుబంధంగా మీడియా పాయింట్ సమీపాన మరో క్యూ ఉంటుంది.


వాస్తవానికి రూ.500 టికెట్లు తీసుకున్నవారు. ప్రొటోకాల్ జాబితాలోని వ్యక్తుల సిపార్సులతో వచ్చే వీఐపీలు ఓ మలుపు నుంచి దర్శనానికి వెళ్లాలి. రూ.500 టికెట్లు తీసుకున్న భక్తులు మాత్రమే అక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నారు. సిఫార్పు లేఖలతో వచ్చినవారు నేరుగా చినరాజగోపురం వద్దకు వచ్చి అక్కడ ఉన్న క్యూలోకి వెళ్తున్నారు.. దీనివల్ల ఓ మలుపు వద్ద నుంచి క్యూలోకి వచ్చిన భక్తులు అమ్మవారి గోపురం వద్దకు చేరుకోవడానికి గంటల సమయం పడుతుంది. ఉచిత దర్శనం, రూ.300, రూ 300 క్యూల్లోని భక్తులకు దర్శనం వేగంగా జరుగుతోంది. దీంతో రూ.500 క్యూలో ఉన్న భక్తులు అసహనానికి గురవుతున్నారు.


గత అనుభవాల నేపథ్యంలో...

దుర్గగుడి ఈవో శీనానాయక్ దేవస్థానానికి సంబంధించిన వివిధ విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు, మూడేళ్ల ఉత్సవాలను ప్రామాణికంగా తీసుకుని వాటి పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. రూ. 500 క్యూలోనే భక్తులు దర్శనం విషయంలో ఆసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయా విభాగాల అధికారులు వివరించినట్లు తెలిసింది.


ఏటా శరనవరాత్రుల్లో మొదటి ఐదు రోజులు టికెట్లను భక్తులు తీసుకుంటారు. మూలనక్షత్రం రోజున వేలమంది అమ్మవారి దర్శనానికి వస్తారు. ఆరోజు అన్ని క్యూల్లో ఉచిత దర్శనం అమలు చేస్తారు. అయితే, ప్రతి దసరా ఉత్సవాల్లో రూ. 500 మాత్రం దర్శనం ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుంచి నిరసనలు పెరుగుతున్న తరుణంలో శరన్నవరాత్రుల్లో అసలు రూ.500 టికెట్ క్యూను రద్దుచేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాస్థాయి అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం మాత్రమే జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్కాతమ్ముళ్లను కలిపిన ఆంధ్రజ్యోతి

25 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

For More AP News and Telugu News

Updated Date - Aug 06 , 2025 | 08:21 AM