ECG and 2D Echo Tests: టెక్నీషియన్లేరీ?
ABN , Publish Date - Aug 06 , 2025 | 07:07 AM
కోస్తా జిల్లాలకే తలమానికంగా నిలుస్తున్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి రోజురోజుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పలు విభాగాల్లో మహిళా రోగులకు వైద్య పరీక్షలను పురుష సిబ్బందే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2డి ఎకో, ఈసీజీ టెస్టులను పురుష సిబ్బంది నిర్వహిస్తుండటంతో మహిళలు చెప్పలేని మానసిక వేదన ఎదుర్కొంటున్నారు.
» ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నారు!
» బెజవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో పురుష సిబ్బందితో మహిళలకు ఈసీజీ, 2డి ఎకొ పరీక్షలు
» కార్పొరేట్ వైద్యం కొనలేక.. ఇక్కడ సిగ్గుతో చచ్చిపోతున్నాం
» తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్న మహిళలు
» దారుణంపై మచిలీపట్నంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు
» 'ఆంధ్రజ్యోతి విజిట్'లో వెలుగు చూసిన దయనీయ దుస్థితి
విజయవాడ/ప్రభుత్వాసుపత్రి/మచిలీపట్నం టౌన్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): కోస్తా జిల్లాలకే తలమానికంగా నిలుస్తున్న కొత్త ప్రభుత్వ ఆసుపత్రి రోజురోజుకు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. పలు విభాగాల్లో మహిళా రోగులకు వైద్య పరీక్షలను పురుష సిబ్బందే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 2డి ఎకో, ఈసీజీ టెస్టులను (ECG and 2D Echo Tests) పురుష సిబ్బంది నిర్వహిస్తుండటంతో మహిళలు చెప్పలేని మానసిక వేదన ఎదుర్కొంటున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరిలో సగానికి పైగా మహిళలు ఉంటున్నారు. వీరికీ పురుష సిబ్బందే వైద్య పరీక్షలు చేస్తుండటంతో మహిళలు తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. సిబ్బందికి తమ బాధను చెప్పుకోలేక, అలాగని పరీక్షలు చేయించుకోలేక ఎంతోమంది సతమతమౌతున్నారు.
పరీక్షల సమయంలో మహిళల ఇబ్బందులు
ఎకొ, ఈసీజీ పరీక్షలు నిర్వహించే సమయంలో కొన్నినందర్భాల్లో తీవ్ర అసౌకర్యానికి మహిళలు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో పై వస్త్రాలు తీసివేసి స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. పురుష సిబ్బందే స్కానింగ్ తీయాల్సిన పరిస్థితిలో రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు.
హృద్రోగ సమస్యల ధ్రువీకరణ కోసం ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో నిర్వహించే ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు పేద, మధ్య తరగతి మహిళల ఆత్మాభిమానాన్ని చంపేస్తున్నాయి. పురుష సిబ్బంది ఎదుట జాకెట్ విప్పి ఛాతిని చూపాల్సి రావటం అత్యంత దారుణం. ఖరీదైన వైద్యాన్ని అందుకోలేక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక ప్రభుత్వాస్పత్రులకు వచ్చే మహిళలు సిగ్గు విడవాల్సి వస్తోంది. ఇక్కడ సిబ్బందిని కూడా నిందించలేని పరిస్థితి. పరీక్షలు నిర్వహించే వారికి... చేయించుకునే వారికి నిత్య సంకటంగా మారుతోంది. విజయవాడ నగరంలో న్యూ జీజీహెచ్, మచిలీపట్నం జీజీహెచ్‌లలో ఈ దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. మచిలీపట్నం ఆస్పత్రిలో జరుగుతున్న దారుణాన్ని ఓ మహిళ ధైర్యంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 'ఆంధ్రజ్యోతి విజిట్’లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి.
ఇద్దరు మహిళలు.. ఐదుగురు పురుష టెక్నీషియన్లు
కొత్త ఆస్పత్రిలో కొన్ని విభాగాల్లో సిబ్బంది కొరతతో ఉన్నవారి నే పనిభారం పెరుగుతోంది.ఆస్పలో ఎకో, ఈసీజీ పరీక్షా కేంద్రాల వద్ద ఇద్దరు మహిళా సిబ్బంది ఉన్నారు. వారిలో ఒకరు సూపర్ బ్లాక్‌లో మరొకరు జీజీహెచ్‌లో ఉంటారు. సూపర్ బ్లాక్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జీజీహెచ్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. ఉదయం షిఫ్ట్‌లో పనిచేసే మహిళా సిబ్బంది మధ్యాహ్నానికి అందుబాటులో ఉండరు. మధ్యాహ్నం పురుష సిబ్బంది తీయాల్సిన పరిస్థితి. దీంతో పురుష సిబ్బంది మహిళలకు పరీక్షలు చేసే సమయంలో తమ మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయోనన్న భయంతో రోగులకు సంబంధించి సహాయకులు పక్కన ఉంటేనే పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. సహాయకులు అందుబాటులో లేని మహిళా రోగులకు పరీక్షలు ఆలస్యమౌతున్నాయి. దీంతో అటు రోగులు, ఇటు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
మచిలీపట్నంలో పరీక్షలపై యువతి ఆగ్రహం
మహిళలకు పురుష టెక్నీషియన్లు 2డి ఎకో టెస్టులు చేస్తుంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సి వస్తోంది. సిగ్గు విడిచి ఛాతీ చూపించాల్సి వస్తోందని కొందరు యువతులు మండిపడుతున్నారు. కృష్ణాజిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మహిళలకు పురుష టెక్నీషియన్లు 2డి ఎకో టెస్టులు పరీక్షలు చేస్తుండటంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమ శరీరాన్ని 2డి పరీక్షల సమయంలో పురుషుల ముందు ప్రదర్శించాల్సిన దుస్ధితి ఏర్పడిందంటూ కొందరు మహిళలు మీడియా ఎదుట వాపోయారు. 2డి పరీక్షలకు మహిళా టెక్నీషియన్లను నియమించాలంటూ బాధితులు గగ్గోలు పెట్టారు. అధికారులకు ఫిర్యాదు చేశారు.
సిబ్బంది కొరతతోనే..
మెడికల్ కళాశాల అధ్వర్యంలో 2డి ఎకో టెస్ట్ రిక్రూట్‌మెంట్ సమయంలో మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి ఇద్దరు పురుష టెక్నీషియన్లు మాత్రం ఇచ్చారు. మహిళా టెక్నీషియన్లను ఇవ్వలేదు. దీంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఒక నర్సును 2డి ఎకో టెస్ట్ సమయంలో ఉంచుతున్నాం. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మహిళా టెక్నీషియను నియమించేందుకు కృషి చేస్తాం.
- సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత
ఈ వార్తలు కూడా చదవండి..
అక్కాతమ్ముళ్లను కలిపిన ఆంధ్రజ్యోతి
25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
For More AP News and Telugu News